russia ukraine conflict: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి దాడిచేసినట్లు రష్యా ప్రకటించింది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందించిన యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను ధ్వంసం చేసేందుకే కీవ్‌పై దాడి చేసినట్లు రష్యా పేర్కొంది. కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించేందుకు సుదీర్ఘ దూరం పయనించే క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. ఐరోపా కూటమి ఉక్రెయిన్‌కు అందించిన టీ-72 ట్యాంకులు సహా ఇతర ఆయుధాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇవన్ని కారు మరమ్మత్తు వ్యాపారానికి సంబంధించిన కొన్ని భవనాల్లో ఉండగా వాటిపై దాడులు చేసి ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
కీవ్ పరిధిలోని డార్నిట్స్కీ, డ్నిప్రోవ్స్కీ ప్రాంతాలపై రష్యా వైమానిక దళాలు దాడి చేసినట్లు నగర మేయర్ విటాలి క్లిట్‌ష్కో అన్నారు. ఆదివారం తెల్లవారుజామున మాస్కో సేనలు జరిపిన క్షిపణి దాడులతో ఆ ప్రాంతాలు దద్దరిల్లినట్లు ఆరోపించారు. పేలుళ్ల ధాటికి దాడి జరిగిన ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుందని మేయర్ తెలిపారు. ఈ దాడిలో ఓ వ్యక్తి గాయపడగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. కీవ్‌లోని రైల్వే నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు లూహాన్స్క్ ప్రాంతంపై రష్యా వైమానిక దాడులకు తెగబడినట్లు ఆ ప్రాంత గవర్నర్ సెర్హియ్ హయ్‌దాయ్ పేర్కొన్నారు. రష్యాకి చెందిన కేఏ-52 హెలికాప్టర్, ఎస్‌యూ-25 యుద్ధ విమానం ఈ దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. క్షిపణి దాడిలో ఓ భవన సముదాయాన్ని దెబ్బతిన్నట్లు చెప్పారు.
అంతకుముందు ఏప్రిల్ 28న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పర్యటిస్తుండగా ఐరాస సిబ్బందికి సమీపంగా రష్యా క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత నుంచి.. ఇప్పటివరకు కీవ్‌పై ఎలాంటి దాడి చేయలేదు. రష్యా సేనలు తమ దృష్టినంతా తూర్పు ఉక్రెయిన్‌పై కేంద్రీకరించి ఆ ప్రాంతాల ఆక్రమణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో కీవ్‌లో గత కొన్ని రోజులుగా ఎలాంటి బాంబు దాడులు లేకపోవడం వల్లే నగర ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆదివారం మళ్లీ కీవ్‌పై దృష్టి కేంద్రీకరించిన రష్యా సేనలు మరోమారు విరుచుకుపడినట్లు కీవ్ మేయర్ వెల్లడించారు.
ఇదీ చదవండి: బ్రేకప్ రివెంజ్.. ప్రేయసి ముఖంపై తన పేరును టాటూగా వేసిన ఉన్మాది