Man Sentenced To 240 Years In Prison : అమెరికాలో ఇద్దరిని కాల్చి చంపిన ఓ వ్యక్తికి అక్కడి కోర్టు 240 సంవత్సరాలు జైలుశిక్ష విధించింది. ఈ మేరకు బుధవారం సంచలన తీర్పును వెలువరించింది. 2022 ఏప్రిల్లో కెంటకీలోని సదరన్ ఇండియానా గ్యాస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఇద్దరిని కాల్చి చంపాడు. ఈ కేసులో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.
చెరోక్ అమీర్ డగ్లస్ అనే వ్యక్తి ఓ గ్యాస్ స్టేషన్లో తన భార్య బ్రాండీకే డగ్లస్ను(38), అక్కడ ఉన్న కస్టమర్ ఎం యెల్లే(43) అనే వ్యక్తిని కాల్చి చంపాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అప్పుడు నిందితుడు ఓ హోటల్లోకి పారిపోయాడు. ఈ క్రమంలో ఆ హోటల్ యజమాని విన్నీ వెన్ను బెదిరించి కారులో బంధించేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఆమె కారు నుంచి కిందపడడం వల్ల గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
అయితే.. నిందితుడికి, ఆయన భార్యకు మృతుడు యెల్లేతో ఎటువంటి సంబంధం లేదని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఘటన జరిగిన సమయంలో యేల్ గ్యాస్ స్టేషన్ వద్దకు వెళ్తుండగా నిందితుడు అతడిపై కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు.
సంచలన తీర్పు
ఈ కేసుపై విచారణను చేపట్టిన ప్లోయిడ్ సుపీరియర్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. చెరోక్ అమీర్ డగ్లస్ అతని భార్యతో పాటు మరో వ్యక్తిని హతమార్చాడని పేర్కొంది. నిందితుడు చేసినవి అత్యంత దారుణమైన నేరాలని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అతడిపై నేరాభియోగాలు రుజువై దోషిగా తేలినందున అతనికి గరిష్ఠంగా 240 సంవత్సరాలు జైలు శిక్షను విధించింది. దీనిపై నిందితుడి తరపు న్యాయవాదులు శిక్షా కాలాన్ని 131 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు. అయితే కోర్టు వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు.
క్షమాపణలు కోరిన నిందితుడు
ఘటన జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందో తనకు గుర్తులేదని చెరోక్ అమీర్ డగ్లస్ తెలిపారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులకు క్షమాపణలు కోరాడు. కోర్టు ఇచ్చిన తీర్పుపై తాను ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేయాలనుకుంటున్నానని చెప్పాడు. అయితే నిందితుడు పట్టుబడిన సమయంలో మాదక ద్రవ్యాలు సేవించి ఉన్నాడని కోర్టుకిచ్చిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు.
కుమార్తెతో కలిసి పనిమనిషికి చిత్రహింసలు.. భారత సంతతి మహిళకు 14ఏళ్ల జైలు శిక్ష
పొరపాటుగా అకౌంట్లోకి రూ.1.28కోట్లు.. తిరిగివ్వని భారతీయుడికి జైలు శిక్ష