Libya Boat Accident 2023 : లిబియా తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడి మహిళలు, పిల్లలు సహా 60 మందికి పైగా మరణించారు. ఐక్యరాజ్య సమితి మైగ్రేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించింది. శనివారం మధ్యదరాసముద్రమార్గం గుండా వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. ఐరోపాలో మెరుగైన జీవనాన్ని కోరుకునే వారికి మధ్యదరా సముద్రం ఓ కీలకమైన, ప్రమాదకరమైన మార్గం. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటికే ఇలా పడవలు మునిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
రాకాసి అలలే కారణమా?
లిబియా పశ్చిమ తీరం గుండా బయలు దేరిన పడవ బలమైన అలల కారణంగానే ప్రమాదానికి గురైందని సమాచారం. ఆ సమయంలో పడవలో 86 మంది వలసదారులు ఉన్నారని, వారిలో 60 మందికిపైగా జలసమాధి అయ్యారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. గతంలో కూడా ఇలానే పలు ప్రమాదాలు జరిగాయి.
యుద్ధాలు, పేదరికమే వలసలకు కారణం
పశ్చిమాసియా, ఐరోపా దేశాల నుంచి ఏటా వేలాది మంది ఐరోపాకు వలస వెళుతుంటారు. దీనికి ప్రధాన కారణం యుద్ధాలు, పేదరికం. వలసదారులందరికీ ప్రధాన రవాణా కేంద్రంగా లిబియా మారింది. మెరుగైన జీవితాన్ని ఆశిస్తూ చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస వెళుతుంటారు. అలాంటి వారంతా ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఈ దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల విషయం తెలిసిందే.
నియంత్రణ లేదు
లిబియా భూభాగంపై ఎవరికీ సరైన నియంత్రణ లేకపోవడం వల్ల ఐరోపాకు చేరుకోవాలనుకుంటున్న వారంతా ఈ దేశ తీరం నుంచే ప్రయాణిస్తున్నారు. ఐఓఎం అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాదే దాదాపుగా 2,250 మంది మరణించినట్లుగా అంచనాలున్నాయి.
మానవ అక్రమ రవాణదారులకు అనుకూలంగా..
లిబియాలోని ప్రస్తత పరిస్థితులు మానవ అక్రమ రవాణాదారులకు అనుకూలంగా మారాయి. ఆరు దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది లిబియా. దీంతో వల ఆయా దేశాలనుంచి వలసదారులు పోటెత్తారు. వీరందని పడవల్లో కుక్కి ప్రమాదకరమైన మార్గాల ద్వారా తీరం దాటిస్తుంటారు.