Lashkar E Taiba Israel Ban : దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ముంబయి మారణహోమానికి కారణమైన పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబాపై నిషేధం విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ విషయాన్ని దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడానికి అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని ఇజ్రాయెల్ ఎంబసీ తెలిపింది. భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అభ్యర్థన లేకుండా స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. లష్కరే తోయిబాను ఘోరమైన తీవ్రవాద సంస్థగా అభివర్ణించింది. వందలాది మంది భారతీయులతో పాటు ఇతరులను పొట్టనపెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. శాంతియుత భవిష్యత్తు కోసం భారత్‌కు బాసటగా ఉంటామని చెప్పింది.
అప్పుడు ఏం జరిగిదంటే?
పాకిస్థాన్‌కు చెందిన పదిమంది ఉగ్రవాదులు.. నవంబర్ 26, 2008 సాయంత్రం కొలాబా సముద్రతీరం నుంచి ముంబయికి చేరుకొన్నారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ముష్కరులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లోకి చొరబడ్డారు. వెంటనే వారిచేతుల్లో ఉన్న ఏకే-47 తుపాకులను తీసి తూటాల వర్షం కురిపించారు. అక్కడ కన్పించిన వారినల్లా పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని ఘటనలతో వణికిపోయిన అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
అక్కడి నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారిలో కేవలం భారతీయులే కాకుండా మరో 14 దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.