ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) లీడర్, ఉగ్రవాది పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్ లాహోర్‌లోని జొహార్ టౌన్లో అతడిని దుండగులు మట్టుబెట్టారు. పరమ్‌జిత్ వెంట ఉన్న ఇద్దరు బాడీగార్డులను సైతం దుండగులు హత్య చేశారు. సన్‌ఫ్లవర్ సొసైటీ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా పరమ్‌జిత్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఉదయం 6 గంటల సమయంలో బైక్‌పై వచ్చి పరమ్‌జిత్‌ను హత్య చేసినట్లు సమాచారం.
సాయుధులు.. పరమ్‌జిత్ తలపై కాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు. ఘటన తర్వాత వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. పంజ్వార్ అప్పడికే మృతి చెందాడని వైద్యులు నిర్ధరించినట్లు స్పష్టం చేశారు. ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, మిలిటరీ ఎంటెలిజెన్స్ (ఎంఐ) అప్రమత్తమయ్యాయి. ఘటనాస్థలిని తమ అధీనంలోకి తీసుకున్నాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలోకి మీడియాను అనుమతించడం లేదు. పరమ్‌జిత్ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
41 ఏళ్ల పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్.. సిక్కు వేర్పాటువాదానికి పునరుజ్జీవం కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాడు. భారత్‌లో జరిగిన అతిపెద్ద బ్యాంకు రాబరీలో నిందితుడిగా ఉన్నాడు. హత్య, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కేసులతో పాటు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఏఎస్ వైద్య హత్య కేసులోనూ అతడు వాంటెడ్‌గా ఉన్నాడు. 1989 నుంచి 1990 మధ్య పరమ్‌జిత్‌పై కనీసం 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. టాడా చట్టం ప్రకారం రెండు కేసులతో పాటు.. పలు హత్య కేసులు రిజిస్టర్ అయ్యాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం.. ఇతడిని ఉగ్రవాదిగా, కేసీఎఫ్‌ను ఉగ్ర సంస్థగా గుర్తించింది.
పంజాబ్‌లోని తరణ్ తారణ్ సమీపంలోని పంజ్వార్లో పరమ్‌జిత్ జన్మించాడు. 1986 వరకు సోహాల్లోని సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేశాడు. 1986లో ఖలిస్థాన్ కమాండో ఫోర్స్‌లో జాయిన్ అయ్యాడు. కేసీఎఫ్‌లో కమాండర్‌గా పనిచేసే తన సోదరుడి ప్రభావం పరమ్‌జిత్‌పై ఎక్కువగా ఉండేది. 1990లో కేసీఎఫ్ కమాండర్ హత్యకు గురైన తర్వాత ఆ సంస్థ బాధ్యతలు చేపట్టాడు పరమ్‌జిత్. అనంతరం పాకిస్థాన్‌కు పారిపోయాడు. సీమాంతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో సంస్థకు నిధులు సమకూర్చేవాడు. పంజాబ్‌లో పేరుమోసిన స్మగ్లర్లైన భోలా తాంతియాన్, పర్గాట్ సింగ్ నర్లీల సహాయంతో అక్రమ రవాణా చేపట్టేవాడు.
పరమ్‌జిత్ భార్య, సంతానం జర్మనీలో మకాం వేసినట్లు సమాచారం. పరమ్‌జిత్ మాత్రం లాహోర్‌లోనే ఉండి.. కేసీఎఫ్ కార్యకలాపాలు చూసుకుంటున్నాడు. అతడు తమ దేశంలో లేడని పాకిస్థాన్ పదేపదే బుకాయించింది. అతడి హత్యతో అతడు లాహోర్‌లోనే తలదాచుకున్నాడని స్పష్టమైంది.