Israel Ground Invasion Gaza : గాజా పట్టీపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం తాజాగా గాజా సిటీలోకి ప్రవేశించింది. ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి గాజాసిటీ మధ్యలోకి ఇజ్రాయెల్ బలగాలు చొచ్చుకువచ్చాయి. వాయు, నౌక, పదాతిదళాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ముందుకు కదులుతున్నాయి. గాజా నగరంలో ఉన్న సొరంగాల్లో ( Hamas Tunnel Network Destruction ) హమాస్ మిలిటెంట్లు, బందీల కోసం ఇజ్రాయెల్ బలగాలు అణువణువూ గాలిస్తున్నాయి. ఉత్తర గాజాలో ఉన్న ప్రజలను దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని సూచిస్తున్నాయి. వారి కోసం మార్గాన్ని ఏర్పాటు చేశాయి.
Israel Hamas War : గాజా సిటీలో ఎక్కువ మంది హమాస్ మిలిటెంట్లు ఉన్నాయని భావిస్తున్న ఇజ్రాయెల్ సేనలు.. వీధివీధినా ప్రత్యక్ష కాల్పులు జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. హమాస్ నిర్మించిన విస్తారమైన, దుర్బేధ్యమైన సొరంగాల నెట్‌వర్క్‌ను గుర్తించి, నాశనం చేసే పనిలో ఇజ్రాయెల్ సైన్యం నిమగ్నమైంది. కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న టన్నెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసేందుకు కంబాట్ ఇంజినీర్‌లు భయంకర పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు. గాజా స్ట్రిప్‌లో సైనికులు ముందుకెళ్లడంలో వాయుసేన కీలక పాత్ర పోషిస్తోంది. సైనికులు వెళ్లే ప్రాంతాల్లో ముందుగానే వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది పౌరులు బలవుతున్నారు.
రెడ్‌క్రాస్ ట్రక్కులపై దాడి..
మంగళవారం అత్యవసర మానవతా సాయం చేస్తున్న రెడ్‌క్రాస్‌కు చెందిన ఓ ట్రక్కుల కాన్వాయ్‌పైనా దాడి జరిగింది. ఈ ఘటనలో వైద్యసామగ్రిని తరలిస్తున్న రెండు ట్రక్కులు దెబ్బతిన్నాయి. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాజాలో మరణాలపై ఐక్యరాజ్యసమితి మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో రోజుకు సగటున 160 మంది చిన్నారులు దుర్మరణం పాలవుతున్నారని దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్‌కు అమెరికా హెచ్చరిక!
అయితే, గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడాన్ని తాము అంగీకరించమని అమెరికా స్పష్టం చేసింది. ఆక్రమణ ఇజ్రాయెల్‌కు, ఆ దేశ ప్రజలకు మంచిది కాదని హెచ్చరించింది. అలాంటి చర్యలను బైడెన్ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత గాజా భద్రతకు సంబంధించిన బాధ్యతలను తామే తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమెరికా స్పందించడం గమనార్హం.
గాజాలో హమాస్ పాలన అంతమైతే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ పరిపాలన సాగిస్తుందా? అమెరికా ప్లాన్ అదేనట!