Israel Attack On Gaza Today : కాల్పుల విరమణ శుక్రవారం ఉదయంతో ముగియడం వల్ల గాజాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో 178 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్ గ్రూప్ ధ్రువీకరించింది. ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు ఏర్పడతాయని యూఎన్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి.
Israel Hamas Ceasefire Expires : అక్టోబర్ 24న ఇజ్రాయెల్- హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం వల్ల వారం రోజుల పాటు దాడులు జరగలేదు. తొలుత నాలుగు రోజులే ఒప్పందం చేసుకున్నప్పటికీ, అనంతరం బందీల విడుదల కోసం ఈ వ్యవధిని పెంచారు. దీంతో ఇరువైపుల నుంచి దాడుల జరగలేదు. ఈ ఒప్పందం శుక్రవారం ఉదయంతో ముగిసింది. హమాస్ తొలుత ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులకు దిగింది. దీంతో బందీల విడుదల ఆగిపోయింది.
కాల్పులు మళ్లీ కొనసాగడంపై అమెరికా, ఐక్యరాజ్యసమితి స్పందించాయి. గాజాలో దాడులను ఆపాలని, కాల్పుల విరమణను పునరుద్ధరించాలని యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్, వైట్‌హౌస్ ఇరుపక్షాలను కోరాయి. మనవతాకోణంలో సహాయం చేసేందుకు ఇజ్రాయెల్, ఈజిప్ట్, ఖతార్ దేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు యూఎస్ జాతీయ భద్రతా కౌన్సిల్ అధికార ప్రతినిధి తెలిపారు.
మరోవైపు.. హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయిన విషయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఇంకా హమాస్ బందీల్లో ఇంకా 200 మంది ఉన్నారని, వారిలో 17 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియెల్ హగారీ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ చెరలో ఉన్న 100 మంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ తమ దేశ జైళ్లలో ఉన్న 240 మంది ఖైదీలను విడుదల చేసింది. అక్టోబర్ 7న హామాస్ ఇజ్రాయెల్‌పై దాడికి దిగి పెను విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్ గాజాలో వైమానిక దాడులకు దిగడం వల్ల సుమారు 15,000 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు.
యుద్ధం మళ్లీ మొదలు- గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ మరో రోజు పొడిగింపు- ఫలించిన ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం