Israel Attack On Gaza Hospital : హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. భీకర రూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గాజాలో యుద్ధం కారణంగా అమాయకులు బలవుతుండడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అల్ అహ్లీ అరబి బాప్టిస్ట్ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500మందికిపైగా మరణించారని.. దీని వెనక ఇజ్రాయెల్ ఉందని హమాస్ నేతృత్వంలో నడుస్తున్న గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. తాము ఆసుపత్రి సమీపంలో ఎటువంటి వైమానిక కార్యకలాపాలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. హమాస్ ఉగ్రవాదులు తమపై ప్రయోగించే రాకెట్లలో.. 25 శాతం వరకు వాళ్ల భూభాగంలోనే పడతాయని పేర్కొంది. ఈ హమాస్ రాకెట్ కూడా గురితప్పి ఆస్పత్రిపై పడిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అయినా ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఉపయోగించిన రాకెట్లు తమ పరికరాలతో సరిపోలడం లేదని ఇజ్రాయెల్ ప్రతినిధి డేనియల్ హగారి స్పష్టం చేశారు.
గాజాలోని ఆస్పత్రిపై బాంబు దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ క్రూరమైన మారణ కాండకు దిగిందని హమాస్ మిత్రపక్షమైన ఇస్లామిక్ జిహాద్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రూరమైన మారణకాండకు కారణమైన ఇజ్రాయెల్ తప్పు నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తోందని.. అందుకే పాలస్తీనాలో జిహాద్ ఉద్యమంపై నిందలు మోపుతోందని వెల్లడించింది. ఈ దాడిని హిజ్బుల్లా కూడా తీవ్రంగా ఖండించింది. గాజాలోని ఆస్పత్రిపై దాడి తర్వాత పాలస్తీనాలో ఆందోళనలు ఎగిసిపడ్డాయి. రమల్లాలో ఆందోళనకారులు భారీగా రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు వ్యతిరేకంగా రాళ్లు విసిరి నినాదాలు.. చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి.
సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిపై వైమానిక దాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్.. దీనిని భయంకరమైన దాడిగా అభివర్ణించారు. ఆసుపత్రులు, వైద్య సిబ్బంది అంతర్జాతీయ మానవతా చట్టం కింద రక్షించాలని.. కానీ ఇక్కడ అది అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్ రాయబార కార్యాలయాల వెలుపల వందలాది మంది నిరసన తెలిపారు. ఆస్పత్రిపై దాడి ఘటనను ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తీవ్రంగా ఖండించారు. ఒక రోజు ప్రజా సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు వెల్లడించారు. ఆస్పత్రిపై దాడిని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా ఖండించింది.
Trump On Gaza Refugees : 'అధికారంలోకి వస్తే గాజా శరణార్థులపై నిషేధం.. సానుభూతిపరులకు నో ఎంట్రీ'