ఇరాన్ హిజాబ్ చట్టాలను పాటించనందుకు ఇటీవల టెహ్రాన్‌లో పోలీసులు అరెస్టు చేసి, కొట్టడం వల్ల మాసా అమీని అనే యువతి కోమాలోకి వెళ్ళి మరణించింది. ఈ సంఘటన ఇరాన్‌లో తీవ్ర నిరసనలకు దారితీసింది. రెండు నెలలుగా నైతిక పోలీసు వ్యవస్థకు వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకింది. అక్కడి మహిళలు తమ తలపై ముసుగులు తొలగించి, జుత్తును కత్తిరించుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇరాన్ హిజాబ్ సమస్య ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎట్టకేలకు ఈ ఆందోళనలతో ఇరాన్ ప్రభుత్వం దిగొచ్చింది. నైతిక పోలీసు వ్యవస్థతో న్యాయవ్యవస్థతో సంబంధం లేదని దాన్ని రద్దు చేస్తున్నట్లు ఇరాన్ అటార్నీ జనరల్ మహ్మద్ జాఫర్ మోంటాజెరి వెల్లడించారు. మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి అనే చట్టాన్ని మార్చాలా అనే దానిపై పార్లమెంట్, న్యాయవ్యవస్థ కలిసి పని చేస్తున్నాయని మెంటాజెరి ప్రకటించిన ఒకరోజు తర్వాత నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇరాన్‌లో మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తలపై తప్పనిసరిగా ముసుగు ధరించాలనే నిబంధన అమల్లో ఉండేది. 1979లో అయతుల్లా ఖొమేని ఇస్లామిక్ ప్రతిఘటన ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇరాన్‌పై పట్టు సాధించారు. అప్పటి నుంచి మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరిగా మారింది. దేశంలో ఇస్లామిక్ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇరాన్‌లో 2005లో ఏర్పాటు చేసిన గస్తే ఎర్షాద్ అనే నైతిక పోలీసు వ్యవస్థ హిజాబ్ చట్టాల అమలును పర్యవేక్షించేది. తమపై బలవంతంగా రుద్దిన చట్టాల గురించి దేశ సరిహద్దులు దాటినప్పుడు ఇరాన్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఇటీవల పోలీసుల దాష్టీకంవల్ల మాసా అమీని అనే యువతి మరణించడంతో తమపై అమలవుతున్న నిర్బంధాల మీద మహిళల నిరసనలు పెల్లుబికాయి.
మాసా మరణానంతరం తలెత్తిన నిరసనలు మహిళలపై ఇరాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజల్లో గూడుకట్టుకొన్న ఆగ్రహాన్ని వెల్లడించాయి. అక్కడి కఠినమైన నిబంధనలను ధిక్కరిస్తూ అమ్మాయిలు తలపై ముసుగులను తొలగించి, వాటిని గాలిలో ఊపుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిర్భయంగా ఇరాన్ స్త్రీలు ప్రదర్శించిన ఆగ్రహం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మహిళలపై బలవంతంగా రుద్దిన చట్టాలకు వ్యతిరేకంగా సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఇరాన్ చివరి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఏకంగా నైతిక పోలీసు వ్యవస్థనే రద్దు చేసింది.