India Canada US Reaction : దౌత్య సిబ్బంది అంశంపై భారత్, కెనడా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అమెరికా, బ్రిటన్ దేశాలు స్పందించాయి. భారత్ నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదంటూ కెనడాకు మద్దతుగా అగ్రదేశాలు వ్యాఖ్యానించాయి. వియన్నా ఒప్పందం మేరకు దౌత్య సంబంధాల బాధ్యతలను భారత్ నిర్వర్తించాలని అమెరికా ( US on India Vs Canada ) పేర్కొంది. దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని దిల్లీ డిమాండ్ చేయడం, కెనడా వారిని వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ఖలిస్థాన్ సానుభూతిపరుడు నిజ్జర్ హత్య కేసులో కెనడా దర్యాప్తునకు సహకరించాలని ఇప్పటికే భారత్‌ను అభ్యర్థించినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.
"సమస్యల పరిష్కారానికి దౌత్యవేత్తలు విధుల్లో ఉండటం చాలా అవసరం. తమ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాపై ఒత్తిడి చేయొద్దని భారత్‌ను మేం ఇప్పటికే కోరాం. దీంతో పాటు కెనడా దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి చేశాం."
-మాథ్యూ మిల్లర్, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి
UK on India Canada Issue : మరోవైపు, బ్రిటన్ సైతం ఈ విషయంపై కెనడాకు మద్దతుగా మాట్లాడింది. భారత్ నిర్ణయాన్ని తాము అంగీకరించలేమని వ్యాఖ్యానించింది. కెనడా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకునేలా భారత్ తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొంది. ఏకపక్షంగా దౌత్యవేత్తలకు రక్షణను ఎత్తివేయడం వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణంగా లేదని యూకే విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఇదీ వివాదం..
ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ హత్య విషయంపై భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తోంది. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కెనడాలోని భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. అయితే, కెనడా ఆరోపణలను భారత్ పూర్తిగా ఖండించింది. ఆరోపణలకు ఆధారాలు ఉంటే సమర్పించాలని స్పష్టం చేసింది. భారత దౌత్యవేత్తను వెనక్కి పంపడానికి ప్రతిగా.. కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని దిల్లీ ఆదేశించింది.
ఇటీవల, కెనడాకు భారత్ మరో అల్టిమేటం జారీ చేసింది. దేశంలో పరిమితికి మించి ఉన్న దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నట్లు కెనడా ప్రకటించుకుంది. నిజ్జర్ వ్యవహారంపై తొలుత తటస్థంగా మాట్లాడుతూ వచ్చిన అమెరికా.. ఆ తర్వాతి నుంచి కెనడాకు మద్దతు పలుకుతూ వస్తోంది. దౌత్యవేత్తల తగ్గింపు వ్యవహారంపైనా కెనడాకు మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
India Canada Issue : నిప్పుతో కెనడా చెలగాటం.. ఖలిస్థానీలకు ఎప్పుడూ అండగా..