China Ship Leaves Srilanka: ఇంధనం నింపుకోవడం సహా సాధారణ కార్యకలాపాల కోసమంటూ శ్రీలంకలోని హంబన్‌టోట ఓడరేవులో మకాం వేసిన అత్యాధునిక నిఘా వ్యవస్థలతో కూడిన చైనా నౌక యువాన్ వాంగ్ 5 స్వదేశానికి తిరుగు పయనమైంది. యువాన్ వాంగ్ 5 నౌక ఆగస్టు 16 ఉదయం 8.20 నిమిషాలకు హంబన్‌టోట ఓడరేవుకు చేరుకుందని ఇంధనం నింపడం సహా మరికొన్ని సాధారణ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఆగస్టు 22 సాయంత్రం నాలుగు గంటలకు శ్రీలంక నుంచి చైనా బయలుదేరిందని లంక అధికారులు ప్రకటించారు. ఈ నౌక చైనాలోని జియాంగ్‌యిన్ పోర్ట్‌కు చేరుకుంటుందని తెలిపారు. నౌక హంబన్‌టోట పోర్టులో ఉన్న ఆరు రోజులు చైనా రాయబార కార్యాలయం కోరిన సాయాన్ని అందించామని లంక నౌకాదళం వెల్లడించింది.
భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా..
అత్యాధునిక నిఘా వ్యవస్థలతో కూడిన ఈ చైనా నౌక హంబన్‌టోటకు వెళ్లే దారిలో తమ రక్షణ వ్యవస్థలపై నిఘా వేసే ముప్పుందని భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా శ్రీలంక అధికారులు ఈ నిఘా నౌకకు అనుమతులు మంజూరు చేశారు. దీనిపై భారత్ అప్పట్లోనే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో, భారత్‌కు అతి సమీపంలో ఉన్న హంబన్‌టోట నౌకాశ్రయంలో చైనా నిఘా నౌక మకాం వేయడం పలు అనుమానాలను రేకెత్తించింది.
భారత్ భయాందోళనలను కొట్టిపారేసిన చైనా..
యువాన్ వాంగ్ 5కు అంతరిక్షం, ఉపగ్రహాలు, క్షిపణులపై మూడో కన్ను వేయగలిగిన సత్తాతో పాటు 750 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను జల్లెడపట్టే సామర్థ్యం ఉంది. దక్షిణ భారతదేశంలోని కీలక రేవులు, అణు పరిశోధనా కేంద్రాలు, నౌకాదళ స్థావరాలన్నీ ఈ నౌక పరిధిలోకి రావడంపై భారత్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే తామేమీ నిఘాకు పాల్పడటం లేదంటున్న డ్రాగన్ వర్గాలు భద్రతాపరమైన భారతదేశ భయాందోళనలను అభూతకల్పనలుగా కొట్టిపారేశాయి. శ్రీలంకలోని హంబన్‌టోట నౌకాశ్రయాన్ని డ్రాగన్ రుణాలతోనే నిర్మించారు. ఆ అప్పులను లంక సర్కారు తిరిగి చెల్లించలేక 99 ఏళ్ల లీజుకు చైనాకు ధారాదత్తం చేసింది.
ఇవీ చదవండి: భారత్‌లోని కీలక నేతపై ఉగ్రదాడికి కుట్ర, రష్యాలో ఐఎస్ సూసైడ్ బాంబర్ అరెస్ట్