Manitoba Bus Accident: కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. మానిటోబా ప్రావిన్స్‌లోని కార్‌బెరీ టౌన్ సమీపంలోని హైవే కూడలిలో 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా మరో 10 మంది గాయపడ్డారు. వీరంతా కార్బెరీలోని ఓ క్యాసినోకు వెళ్తున్నారు. కార్‌బెరీ ప్రాంతం.. మానిటోబా రాజధాని విన్నిపెగ్‌కు పశ్చిమాన 170 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగిన బస్సులో ఉన్న వారంత వయో వృద్ధులని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంపై కెడనా ప్రధాని జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. 'మానిటోబా ప్రమాదం చాలా విషాదకరమైనది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారు అనుభవిస్తున్న బాధను ఊహించలేను. కానీ కెనడియన్లు వారి కోసం ఉన్నారు' అని ట్రూడో అన్నారు.
సింగపూర్‌లో భారతీయుడు మృతి..
Indian Worker Died In Singapore : సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 20 ఏళ్ల భారతీయుడు మృతి చెందాడు. ఓ భవనాన్ని కూల్చివేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు శిథిలాల కింద చిక్కుకున్నాడు. దాదాపు 8 గంటల పాటు శ్రమించిన సహాయక సిబ్బంది.. మృతదేహాన్ని బయటకుతీశారు. అతడి మృతదేహాం రెండు మీటర్ల శిథిలాల కింద ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగపూర్‌కు చెందిన ఐక్ సన్ డెమోలిషన్ అండ్ ఇంజినీరింగ్ అనే కంపెనీలో 20 ఏళ్ల భారతీయ పౌరుడు పనిచేస్తున్నాడు. గురువారం టాంజోంగ్ పగర్లోని ఫుజి జిరాక్స్ టవర్స్ భవనం కూల్చివేస్తున్న సమయంలో.. ఆ భవనంలోని కొంత భాగం కూలిపోవడం వల్ల శిథిలాల కింద చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఎస్‌సీడీఎఫ్).. డిజాస్టర్ అసిస్టెన్స్ అండ్ రెస్క్యూ టీమ్ (డీఏఆర్టీ)ను రంగంలోకి దించింది. దీంతో పాటు 11 ఎమర్జెన్సీ వాహనాలను.. 70 మంది అధికారులను, రెండు డాగ్ స్క్వాడ్లను ఘటనా స్థలంలో మోహరించింది.
మనిషి సంకేతాలను గుర్తించడానికి ఫైబర్ ఆప్టిక్ స్కోప్, లైఫ్ డికెక్షన్ పరికరాలను కూడా మోహరించారు. కొన్ని గంటలపాటు శ్రమించిన సహాయక బృందాలు.. దాదాపు రెండు మీటర్ల శిథిలాల కింద బాధితుడు ఉన్నట్లు గుర్తించాయి. అయితే, కాంక్రీటు స్లాబ్ దాదాపు 50 టన్నుల మేర ఉండటం వల్ల.. సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. కాంక్రీటును దిమ్మెలను పగలగొట్టి.. గురువారం రాత్రి మృతదేహాన్ని బయటకు తీశారు. శిథిలాల కింద ఇంకా ఎవరూ చిక్కుకోలేదని సీసీటీవీ ఫుటేజీలో తెలిసినా.. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగించారు.