బంగ్లాదేశ్ రాజధాని నగరంలో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం సాయత్రం ఓ ఏడు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అందులో ఉన్న 17 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఆ భవనం శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకునే అవకాశం ఉన్నందున మరణించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసుల వెల్లడించారు. సమచారం అందుకున్న అగ్నిమాపక దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వీరితోపాటుగా ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్‌లోని బాంబు నిర్వీర్యం విభాగం కూడా అక్కడకు చేరుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కరణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు డీఎంసీబహెచ్ పోలీసులు అధికారి బచ్చు మియా వెల్లడించారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.
అయితే ఈ భవనం కింద అంతస్తులో శానిటరీ ఉత్పత్తుల దుకాణాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన ఈ బిల్డింగ్‌కు పక్కనే బీఆర్ఏసీ బ్యాంక్ కూడా ఉంది. ఈ ప్రమాదం దాటికి ఆ బ్యాంకు అద్దాలు పగిలిపోయాయి. దీంతో పాటుగా రోడ్డుపై ఉన్న ఓ బస్సు కూడా ధ్వంసమైంది. వ్యాపార సముదాయంలో నిల్వ ఉంచిన రసాయనాల కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
"మొదట ఇది భూకంపం అని అనుకున్నాను. ఈ పేలుడుతో సిద్దిక్ బజార్ ప్రాంతం మొత్తం కదిలింది. దెబ్బతిన్న భవనం ముందు 20 నుంచి 25 మందిని చూశాను. వారంతా గాయాలతో సహాయం కోసం కేకలు వేశారు. కొంతమంది భయపడి పరుగులు తీశారు. వెంటనే స్థానికులు గాయపడిన వారిని వ్యాన్‌ల్లో, రిక్షాల్లో ఆస్పత్రికి తరలించారు" అని ప్రత్యక్షసాక్షి సఫాయెత్ హుస్సేన్ తెలిపాడు. "ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. వెంటనే ప్రజలు భవనం నుంచి బయటకు వచ్చారు. అందరి ముఖాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భవనం కిటికీల అద్దాలు పగిలి వీధిలో పడ్డాయి" అని మరో ప్రత్యక్షసాక్షి అలంగీర్ చెప్పారు.
ఆయిల్ డిపోలో పేలుడు..
మార్చి 3న ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించి 16 మంది మృతి చెంది.. అనేక మంది గాయపడ్డారు. 180 మంది అగ్నిమాపక సిబ్బంది, 37 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశాయి. ఉత్తర జకార్తాలోని తనహ్ మేరా పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆయిల్ డిపోలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇండోనేసియా ఇంధన అవసరాల్లో 25 శాతం మేర ఈ డిపో నుంచి సరఫరా చేస్తుంది. శుక్రవారం భారీ వర్షంతో పాటుగా పిడుగుల కారణంగా ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.