Afghanistan Earthquake 2023 : అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంపంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి గాయాలయ్యాయి. 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. హెరాత్ ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కనీసం ఐదు శక్తిమంతమైన భూకంపాలు సంభవించినట్లు వెల్లడించారు.
అమెరికా మ్యాప్ రిలీజ్..
హెరాత్‌కు 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 6.3 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయని తెలిపింది. అనంతరం 5.5 తీవ్రతతో మరో భూకంపం వచ్చిందని వివరించింది. భూకంపాల తీవ్రతను చూపించే మ్యాప్‌ను సైతం విడుదల చేసింది అమెరికా.
"ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దుకాణాలు అన్నీ ఖాళీ అయ్యాయి. మళ్లీ భూకంపం సంభవిస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. నేను నా కుటుంబం ఇంట్లో ఉన్నాం. ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి. వెంటనే నా కుటుంబ సభ్యులు అరుస్తూ బయటకు పరుగులు తీశారు. ఇంట్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు."
-అబ్దుల్ సకార్ సమది, ప్రత్యక్ష సాక్షి
ఈ ఘటనపై తాలిబన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎంత మంది చనిపోయారు, ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. టెలిఫోన్ కనెక్షన్లు తెగిపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఎంత నష్టం సంభవించిందనేది తెలియడం లేదు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోల ప్రకారం.. వందలాది మంది అఫ్గాన్ పౌరులు బయటకు పరుగులు తీశారు.
మొరాకోలో విలయం..
ఇటీవల మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 2,862 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. మర్రాకేష్, చిచౌవా, టరౌడెంట్ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఇళ్లు, భవనాలు పూర్తిగా దెబ్బతినడం వల్ల ప్రజలు రహదారులపైనే గడిపారు. టూరిజానికి ప్రఖ్యాతి గాంచిన మర్రకేష్ నగరం తీవ్రంగా దెబ్బతింది. 12వ శతాబ్దంలో నిర్మితమైన ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా యునెస్కో గుర్తించింది. ఈ ఓల్డ్ సిటీలో మసాలాల మార్కెట్లతో పాటు రాజసౌధాలు ఉన్నాయి. ఇక్కడి ప్రాచీన కౌటౌబియా మసీదుకు దేశ విదేశాల నుంచి పర్యటకులు వస్తుంటారు.
అఫ్గాన్, పాక్‌లో భారీ భూకంపం.. 11 మంది మృతి.. దిల్లీలోనూ కంపించిన భూమి