బ్రిటన్ పార్లమెంటు నేటి నుంచి నెలరోజుల పాటు తాత్కాలికంగా రద్దు కానుంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఎంపీలు ముందుకు సాగనీయడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.
బ్రిటన్ పార్లమెంట్ సమావేశాలను సస్పెండ్ చేయాలన్న జాన్సన్ వినతికి క్వీన్ ఎలిజబెత్ రాణి-2 గత నెలలో ఆమోదం తెలిపారు. బ్రెగ్జిట్‌కు సరికొత్త శాసన అజెండాను ఆవిష్కరించేందుకు వీలుగా సమావేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని ఎలిజబెత్‌ను కోరారు జాన్సన్.
బోరిస్ నిర్ణయంపై విపక్షం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బ్రెగ్జిట్‌పై చర్చ చేపట్టకుండా నిలువరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు విపక్ష ఎంపీలు. ఇది రాజ్యాంగపరమైన దౌర్జన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐరోపా సమాఖ్యతో ఎలాంటి ఒప్పందం లేకుండా బ్రిటన్ వైదొలిగేందుకు రూపొందించిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బోరిస్ సొంత పార్టీకి చెందిన ఎంపీలు విపక్షానికి మద్దతుగా నిలుస్తున్నారు.
బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న 21మంది అధికార కన్సర్వేటివ్ ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించారు బోరిస్.