పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పుట్టిల్లయిన బ్రిటన్‌లో నేడు జరగనున్న ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాలుగేళ్ల వ్యవధిలో జరుగుతున్న మూడో ఎన్నికలివి. 2015లో సార్వత్రిక, 2017లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మరో ముందస్తుకు రంగం సిద్ధమైంది. రాజ్యాంగం ప్రకారం దిగువసభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం ఉంటేనే ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమమవుతుంది. 2015 నాటి ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. డేవిడ్ కామరన్ రెండోసారి ప్రధాని పగ్గాలు అందుకున్నారు. తరవాత నిర్ణీత గడువు ప్రకారం 2020లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాలన్న ప్రజా నిర్ణయంతో కామరన్ 2016 జులైలో రాజీనామా చేశారు.
ఆయన స్థానంలో థెరెసా మే ప్రధాని బాధ్యతలు అందుకున్నారు. మార్గరెట్ థాచర్ తరవాత ఓ మహిళ ప్రధాని కావడం అది రెండోసారి. థాచర్ మాదిరిగా థెరెసాకు మొండిఘటమన్న పేరుంది. ‘బ్రెగ్జిట్’ ప్రక్రియను సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలంటే బలమైన ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతో ఆమె 2017 జూన్‌లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ‘బ్రెగ్జిట్’ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడంలో వైఫల్యం కారణంగా ఈ ఏడాది మే లో థెరెసా మే రాజీనామా చేశారు. దీంతో విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ అధికారాన్ని చేపట్టారు. బ్రెగ్జిట్ తలనొప్పులతో ఆయనా ముందస్తుకు సిద్ధమయ్యారు. దీన్నిబట్టి ‘బ్రెగ్జిట్’ వ్యవహారం బ్రిటన్‌ను ఎంతగా ఇరుకున పెట్టిందో అర్థమవుతోంది.
రెండు పార్టీల మధ్యే పోటీ
మొత్తం 650 స్థానాలు గల దిగువసభ (మన లోక్‌సభ వంటిది)లో కనీస మెజారిటీ సాధించాలంటే 326 స్థానాలు గెలవాలి. ఇంగ్లాండ్‌లో 533, స్కాట్లాండ్‌లో 59, వేల్స్‌లో 40, ఉత్తర ఐర్లాండ్‌లో 18 స్థానాలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో ఇంగ్లాండ్ ప్రాధాన్యం ఎక్కువే. అత్యధిక స్థానాలు ఉండటమే ఇందుకు కారణం. థెరెసా మే నాయకత్వంలో 2017లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కన్జర్వేటీవ్ పార్టీ 317 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీల మధ్యనే ఎప్పుడూ పోటీ ఉంటోంది. జొ స్విన్సన్ నాయకత్వంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ, నికొలస్ స్టర్జన్ సారథ్యంలోని స్కాటిష్ నేషనల్ పార్టీ, నైగెల్ ఫరాగె ఆధ్వర్యంలోని యూకే ఇండిపెండెన్స్ పార్టీ రంగంలో ఉన్నాయి. ‘బ్రెగ్జిట్’, ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఆరోగ్య, సామాజిక పథకాలు, వాతావరణ మార్పులు, వలసలు, శాంతి భద్రతలు ప్రధాన ప్రచార అంశాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ‘బ్రెగ్జిట్’ అత్యంత కీలకంగా మారింది. నాలుగేళ్లుగా దేశ రాజకీయాలు పూర్తిగా దీని చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికీ ‘బ్రెగ్జిట్’ ప్రక్రియ పూర్తి కాలేదు. తరచూ వాయిదాలు పడుతోంది.
బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తి చేస్తాం
28 సభ్య దేశాలు గల ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి ఈ ఏడాది మార్చి 29నే బ్రిటన్ వైదొలగాల్సి ఉంది. ఆ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలం కావడంతో గడువును అక్టోబరు 31కి పొడిగించారు. తాము అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది జనవరి 31లోగా ఎట్టి పరిస్థితుల్లో ‘బ్రెగ్జిట్’ ప్రక్రియను పూర్తి చేస్తామని కన్జర్వేటివ్ పార్టీ ప్రకటించింది. ఈ విషయంలో కఠినంగా ముందుకు వెళ్లాలని పార్టీ తలపోస్తోంది. అందువల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది విశ్లేషకుల వాదన.
వలసలకు ఇబ్బందులు ఉండవు
వలసలకు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని ఆస్ట్రేలియా తరహా విధానాన్ని అవలంబిస్తామని పార్టీ చెబుతోంది. దీనివల్ల ముఖ్యంగా భారతీయులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇస్తోంది. తాము తెచ్చే కొత్త వలస విధానం ప్రపంచవ్యాప్తంగా గల మేధావులను ఆకర్షిస్తుందని, తక్కువ నైపుణ్యం గలవారు సైతం తమ దేశానికి వస్తున్నారని, వారిపై ఆంక్షలు, తనిఖీలు ఉంటాయని చెబుతోంది. ఉద్యోగుల కొరత ఉన్నప్పుడే అటువంటివారిని అనుమతిస్తామని, వారు బ్రిటన్‌లో నివసించడం తాత్కాలికమేనని పేర్కొంది. ఎ
ఎన్‌హెచ్‌ఎస్ తప్పనిసరి
వరు తమ దేశంలోకి వచ్చినా జాతీయ ఆరోగ్య సేవల (ఎన్‌హెచ్‌ఎస్) విధానానికి అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టీకరించింది. ప్రవాస భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రధాని జాన్సన్ ప్రముఖ హిందూ దేవాలయమైన స్వామి నారాయణ్ మందిరాన్ని భారత సంతతికి చెందిన పార్టీ నాయకురాలు క్యారీ సైమండ్స్, హోంమంత్రి ప్రీతి పటేల్‌తో కలిసి సందర్శించారు. గుజరాత్ మూలాలున్న ప్రీతీ పటేల్ ప్రధాని మోదీకి గట్టి మద్దతుదారు. ప్రవాస భారతీయుల ఓట్లను దృష్టిలో ఉంచుకునే ఆమెకు కీలకమైన హోం శాఖను అప్పగించారు.
పట్టువిడుపులతో వ్యవహరించాలి
‘బ్రెగ్జిట్’ విషయంలో ఉదారంగా ఆచితూచి వ్యవహరించాలని, మొండి పట్టుదలకు పోరాదని విపక్ష లేబర్ పార్టీ అధినేత జెర్మి కోర్బిన్ వాదిస్తున్నారు. ‘బ్రెగ్జిట్’ అనివార్యమని, అది చట్టబద్ధమైన ప్రక్రియ అయినందున, దాన్ని ఏ ప్రభుత్వం అడ్డుకోలేదని, అందువల్ల పట్టువిడుపులతో వ్యవహరించాలని ఆయన సూచిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘బ్రెగ్జిట్’ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆరు నెలల సమయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 2017 నాటి ఎన్నికల్లో 262 స్థానాలను ఈ పార్టీ సాధించింది. సమగ్ర ఆరోగ్య విధానాలపై పార్టీ ఆసక్తి చూపుతోంది. స్వాతంత్య్ర సంగ్రామంలో ఇది భారత్‌కు అండగా నిలిచింది. వ్యక్తులు, కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీగా దీనికి పేరుంది. కొన్ని కీలక పరిశ్రమలను జాతీయం చేస్తామని కోర్బిన్ హామీ ఇచ్చారు. కార్పొరేట్, ఆదాయపన్ను పెంచుతామని ప్రకటించారు. ప్రధాన పార్టీలు పోటాపోటీగా తలపడినప్పటికీ ప్రజల మొగ్గు కన్జర్వేటివ్ పార్టీవైపే ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
కొత్త సర్కారుకు కఠిన సవాళ్లు
దేశ ఆర్థికవ్యవస్థ అధ్వానంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ దుస్థితికి ‘బ్రెగ్జిట్’ సైతం ఓ కారణం. దేశ వాణిజ్యంలో సగభాగం ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలతోనే జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి వైదొలగడం వల్ల దేశానికి కొన్ని నష్టాలు, లాభాలు ఉన్నాయి. ఇది హడావుడిగా పూర్తయ్యే పని కాదు. అందువల్ల ఆచితూచి అడుగేయాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా బ్రిటన్ ఇప్పుడు పూర్తిగా ప్రాధాన్యం కోల్పోయింది.
భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైనప్పటికీ అది అమెరికాకు తోక దేశంగానే మిగిలిపోయింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో చాలావరకు అగ్రరాజ్యానికి వంతపాడటం తప్ప దానికంటూ ప్రత్యేక విధానం లేదు. ప్రపంచ సమస్యలను ప్రభావితం చేసే శక్తి ఏనాడో కోల్పోయింది. ఐరోపా సమాఖ్య (ఈయూ)లోని పెద్ద దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ సైతం బ్రిటన్‌ను లెక్క చేసే స్థితిలో లేవు. ఎన్నికల్లో నెగ్గి అధికారం చేపట్టబోయే పార్టీ బహుముఖ సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
- గోపరాజు మల్లపురాజు
ఇదీ చూడండి : నేడే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు- హంగ్ తప్పదంటున్న సర్వేలు!