16 ఏళ్ల బాలిక ఫిన్లాండ్‌కు ప్రధాని కాగలదా? కానీ, అయ్యింది! బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన ఆమె.. ఆ వెంటనే కేబినెట్ మంత్రులు, చట్టసభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించింది. బాలికలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం చాలా ముఖ్యమని, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరముందని నొక్కి చెప్పింది. సాంకేతికంగా దూసుకెళ్తున్న ఫిన్లాండ్... బాలికలకు ఆ ఫలాలను అందించేందుకు ఏమేం చేయగలదన్న విషయమై ఆరా కూడా తీసింది!
ఆమె ప్రధాని ఎలా కాగలిగిందంటే...
ఈ నెల 11న 'అంతర్జాతీయ బాలికల దినోత్సవం'. దాన్ని పురస్కరించుకుని ఐరాస బుధవారం 'గర్ల్స్ టేకోవర్' కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా దక్షిణ ఫిన్లాండ్‌లోని వాక్సే గ్రామానికి చెందిన ఆవా ముర్టో(16) ఒక్కరోజు ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.
స్త్రీ-పురుష సమానత్వ భావనను చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముర్టోతో పాటు అసలు ప్రధాని సనా మారిన్ కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వారిద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
"ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, పరిష్కారం కనుగొనాలి" అని వారు పేర్కొన్నారు. ఫిన్లాండ్‌లోని చాలా సంస్థలు కూడా మహిళా సిబ్బందికి ఒక్కరోజు సారథ్య బాధ్యతలు అప్పగించాయి.
ఇదీ చూడండి: వేడి పుట్టించే బ్యాండేజీతో చర్మ క్యాన్సర్కు చెక్!