కరోనాపై భారత్ చేస్తున్న పోరాటానికి స్విట్జర్లాండ్ వినూత్నంగా సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు ప్రఖ్యాత స్విస్ ఆల్ఫ్స్‌లోని మేటర్‌హార్న్ పర్వతంపై కొద్దిసేపు భారత జాతీయ జెండా కాంతులను ప్రదర్శించింది. స్విట్జర్లాండ్- ఇటలీ దేశాల సరిహద్దుల్లో పిరమిడ్ ఆకారంలో ఉండే ఈ పర్వతం ఎత్తు 4.478 మీటర్లు. కొవిడ్-19 మహమ్మారిపై ప్రపంచ దేశాలు పోరాటం చేస్తోన్న తరుణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కళాకారుడు గెర్రీ హోఫ్ స్టెర్ వివిధ దేశాల జాతీయ పతాకాల కాంతులను దీనిపై అద్భుతంగా ప్రదర్శించారు.
"ప్రపంచంలోని అతి ప్రముఖ దేశాల్లో ఒకటైన భారత్ కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతోంది. అలాంటి పెద్ద దేశంలో ఎదురయ్యే సవాళ్లు అపారమైనవి. మేటర్హార్న్పై త్రివర్ణ పతాకం కాంతులను ప్రసరింపజేయడం ద్వారా ఈ పోరులో భారతీయులందరికీ మద్దతు తెలుపుతున్నాం." అని స్థానిక పర్యాటక సంస్థ జెర్మాట్ మేటర్‌హార్న్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది.
"భారతీయులకు సంఘీభావంగా మేటర్‌హార్న్ పర్వతంపై వెయ్యి మీటర్ల కంటే పెద్ద పరిమాణంలో భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. 'జెర్మాట్ మేటర్‌హార్న్'కు ధన్యవాదాలు." అని స్విట్జర్లాండ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది.
మానవత్వానిదే విజయం..
ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. "కొవిడ్-19పై ప్రపంచం మొత్తం కలిసికట్టుగా పోరాడుతోంది. మహమ్మారిపై మానవత్వమే కచ్చితంగా విజయం సాధిస్తుంది." అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఆఫ్-క్యాంపస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి'