మనం ఎక్కువగా పర్యావరణాన్ని కాలుష్యం చేసే ప్లాస్టిక్ గురించే ఆలోచిస్తుంటాం. వీటిని మళ్లీ రీసైకిల్ చేయడంపై దృష్టి పెడతాం.. కానీ, వస్త్రాలు కూడా భూకాలుష్యానికి కారణమవుతున్నాయి. ఏటా దాదాపు 25 మిలియన్ టన్నుల వస్త్రాలను ప్రజలు బయట పారేస్తూ ఉంటారట. దీంతో ఇవి భూమిలో పేరుకుపోతుంటాయి. కాటన్ భూమిలో కలిసిపోవడానికి కొన్ని నెలల సమయం పడుతుండగా.. సింథటిక్ వస్త్రాలు మట్టిలో కలిసిపోవడానికి 20 నుంచి 200 ఏళ్లు పడుతుంది. అందుకే ఈ వస్త్రాలను కూడా రీసైకిల్ చేసే మార్గాన్ని స్వీడెన్‌లోని లుండ్ యూనివర్సిటీ కెమికల్ ఇజినీరింగ్ విభాగం కనిపెట్టింది.
వినియోగించి బయటపారేసిన కాటన్ వస్త్రాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి సల్ఫ్యూరిక్ యాసిడ్‌లో నానబెడతారట. వస్త్రం యాసిడ్‌లో కరిగిపోయి.. ద్రావణం రూపంలో గ్లూకోజ్ ఉత్పత్తవుతుంది. ఈ గ్లూకోజ్‌తో ఎన్నో ఉపయోగాలున్నాయి. అయితే, ఈ వస్త్రాలతో ఉత్పత్తయిన గ్లూకోజ్‌ను వేరే వస్త్రాలను తయారు చేయడంలో ఉపయోగించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం కాటనే కాదు.. స్పాండెక్స్, నైలాన్ వంటి వస్త్రాలతోనూ ఇథనాల్ వంటి రసాయనాలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
మొదట్లో కాటన్ వస్త్రాలపై ప్రయోగం చేయగా.. కేవలం 3 నుంచి 4 శాతం మాత్రమే గ్లూకోజ్ ఉత్పతి అయ్యేదని.. ఇప్పుడు 90శాతం గ్లూకోజ్ ఉత్పత్తి అయ్యేలా కృషి చేశామని చెబుతున్నారు. భవిష్యత్తులో వస్త్రాలను రిసైకిల్ చేయడానికి వీలుగా యంత్రాలు.. కర్మాగారాలు ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారు.