Gender Equality: 'ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే పనులన్నీ మహిళలు చేస్తారు, పురుషులేమో వాళ్లకు ముందు వరుసలో నిలబడి అంతా తామే చేసినట్లు చెప్పుకుంటారు..' అంటూ మొదలవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. వైద్యరంగంలో డెబ్భైశాతం పనిని చేసేది మహిళలే అయినా నాయకత్వ స్థానాల్లో మాత్రం వారు కన్పించకపోవడానికి కారణం పురుషాధిక్య ధోరణీ, స్త్రీల పట్ల వివక్షా తప్ప మరొకటి కాదని ఆ నివేదిక తేల్చి చెప్పింది. ఒక్క వైద్య రంగమే కాదు, ఉద్యోగాల్లోనూ నాయకత్వ స్థానాల్లోకి వచ్చేసరికి వంద మంది పురుషులకు 37గురు మహిళలే ఉంటున్నారనీ, పైపైకి వెళ్లేకొద్దీ అది ఇంకా తగ్గిపోతోందనీ అన్ని రంగాల్లోనూ అదే పరిస్థితనీ అంటోంది సమానత్వ సూచీ. వివిధ రంగాల్లో స్త్రీల స్థితిగతులను పలు కోణాల్లో విశ్లేషించి ప్రపంచ ఆర్థిక వేదిక తయారుచేసే ఈ సూచీ నిజానికి ఆయా దేశాలకు చక్కటి మార్గదర్శకంగా నిలుస్తుంది.. ఏం చేస్తే సమానత్వం సాధించవచ్చో తెలియజేస్తుంది.
సమానావకాశాలు పొందడం స్త్రీల హక్కు. అవి లభిస్తే- అన్నిటికన్నా ముఖ్యంగా సమాజంలో అన్ని రకాల హింసా తగ్గుతుంది. శాంతి పెరుగుతుంది. ప్రపంచమంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. ఆ పరిస్థితి వల్ల ఆర్థికంగా- అక్షరాలా ఏడాదికి 12 ట్రిలియన్ (సుమారుగా రూ.9 కోట్ల కోట్లు డాలర్ల సంపద పెరుగుతుంది. అది ఎంత పెద్ద మొత్తమంటే- జపాన్, జర్మనీ, బ్రిటన్.. మూడు దేశాల వార్షిక జీడీపీ కలిస్తే ఎంతవుతుందో అంత.
స్త్రీల శ్రమని పంచుకుని, నాయకత్వ స్థానాల్లో సమానావకాశాలిస్తేనే ఆ సంపద మన సొంతమవుతుందని మెకిన్సే నివేదిక చెబుతోంది. అందుకే... ఆ దిశగా మరో అడుగు ముందుకేయడానికే.. స్ఫూర్తినిచ్చే ఈ పరిణామాలను గుర్తుచేసుకోవడం. గత రెండేళ్లూ ప్రపంచం పెను ఉత్పాతాన్ని చూసింది. అలాంటి నిరాశామయ పరిస్థితుల్లోనూ సంక్షోభాలను ఎదుర్కొని నిలబడే సత్తా స్త్రీలకుందని రుజువు చేస్తూ రాజకీయ, ఆర్థిక తదితర కీలకరంగాల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలివి.
పాతిక దేశాలకు ప్రధానులు!
'ప్రపంచంలోనే అత్యంత ఆనందకరమైన దేశం మాది. దాన్ని శాశ్వతంగా నిలుపుకుంటాం. సమానత్వ సూచీలో మరింత ముందుకెళ్తాం. పద్దెనిమిదేళ్లవరకూ పిల్లలందరికీ నిర్బంధ విద్యను అమలుచేస్తాం. పితృత్వ సెలవును 97 రోజులకు పెంచుతున్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలవల్లే నేను చదువుకుని ఇంతదాన్నయ్యాను. కాబట్టి వాటిని మరింత ప్రయోజనకరంగా మలుస్తాను' అంటూ గర్వంగా చెబుతారు ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్. ప్రస్తుతం ప్రపంచదేశాల పాలకుల్లో పిన్నవయస్కురాలామె. కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో సమర్థంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఫిన్లాండ్‌తో సహా నార్దిక్ దేశాలుగా పేరొందిన డెన్మార్క్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్‌లలో నాలుగు దేశాలకు ప్రస్తుత ప్రధాన మంత్రులు మహిళలే. ఐదోదైన నార్వేకి కూడా గతేడాది వరకూ మహిళే ప్రధానిగా ఉండేది. ఉత్తర యూరప్‌లో ఉన్న ఈ దేశాలు భౌగోళికంగానే కాదు, సాంస్కృతికంగానూ దగ్గరగా ఉంటాయి. అందుకేనేమో సమానత్వ సూచీలోనూ తొలి వరసను ఆక్రమిస్తుంటాయి. కాబట్టి ఆ దేశాల్లో మహిళలు ప్రధానులు కావడంలో విశేషమేమీ లేదనుకుంటున్నారేమో.. అయితే ఇది చూడండి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం గతేడాది సెప్టెంబరు నాటికి ప్రపంచంలో పాతిక దేశాలు మహిళల పాలనలో ఉన్నాయి. ఒక్క 2021 లోనే ఎనిమిది దేశాలు తొలి మహిళా ప్రధానిని ఎన్నుకొని చరిత్ర సృష్టించాయి. ఎస్తోనియా, సమోవా, ఉగాండా, బార్బడాస్, సెర్బియా, ఆఖరికి అరబ్ దేశం ట్యునీషియాతో సహా అన్నిటికీ ఇప్పుడు అతివలే నేతలు. వీళ్లంతా కూడా ఉన్నత చదువులు చదివి అవగాహనతో రాజకీయాల్లోకి వచ్చినవారే కానీ వారసత్వంతో వచ్చినవారు కాకపోవడం విశేషం.
ఇక, మంత్రివర్గాల్లో సగమూ అంతకన్నా ఎక్కువ మహిళల్ని నియమించుకున్న దేశాలు చరిత్రలోనే మొదటిసారి పద్నాలుగుకు చేరాయి. అల్బేనియా మంత్రివర్గంలో డెబ్భై శాతం మహిళలే. జర్మనీ మొట్టమొదటిసారి మంత్రివర్గంలో సమానత్వాన్ని సాధించింది. ఇరాక్, కొసావొ దేశాలు పార్లమెంటులో మహిళల కోటాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
ప్రపంచ వాణిజ్యం.. ఆమె చేతిలో..
ఒకవైపు అగ్రదేశాల ఆధిపత్య పోరు.. మరోపక్క కొవిడ్ దెబ్బకి ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమై సాయం కోసం చూస్తున్న పేద దేశాలు. 164 సభ్య దేశాల వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేసే ప్రతిష్ఠాత్మక సంస్థ- ప్రపంచ వాణిజ్య మండలి ముందున్న సవాళ్లు చిన్నవి కావు. ఈ పరిస్థితుల్లో మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఒక దారికి తేవాలంటే- ఎంగొజి ఒకాంజొ ఇవేల మాత్రమే సరైన వ్యక్తి అనుకున్నారు, సంస్థ పగ్గాలను ఆమెకు అప్పజెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కి డైరెక్టర్ జనరల్ అయిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అయిన ఒకాంజొ బాల్యం అంతా పేదరికంలో గడిచింది. ఆమెను అమ్మమ్మ దగ్గర వదిలి అమ్మానాన్నలిద్దరూ చదువుకోడానికి అమెరికా వెళ్లిపోయారు. దాంతో పల్లెటూళ్లో వ్యవసాయపనులు చేస్తూ తన ఫీజులకు తానే సంపాదించుకుంటూ చదువుకున్నారామె. పై చదువులకు అమెరికా చేరిన ఒకాంజొ హార్వర్డ్, ఎంఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పీహెచ్‌డీ చేసి డెవలప్‌మెంట్ ఎకనమిస్టుగా వరల్డ్ బ్యాంక్‌లో పనిచేస్తూ మేనేజింగ్ డైరెక్టరు స్థాయికి ఎదిగారు.
2008-09 ఆహారసంక్షోభం సమయంలో పేద దేశాలకు సాయం అందించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత నైజీరియా ఆర్థికమంత్రిగా ఆమె చేపట్టిన సంస్కరణలను ప్రపంచం విస్మయంగా చూసింది. కేవలం చర్చలతో దేశాన్ని 30 బిలియన్ డాలర్ల అప్పునుంచి విముక్తం చేశారు ఒకాంజొ. పాలనలో పారదర్శకత పెంచే విధానాలవల్ల దాదాపు 70 వేలమంది నకిలీ ఉద్యోగుల గుట్టు రట్టయింది. బడ్జెట్‌లో స్త్రీలూ పిల్లల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ ‘జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్’ వ్యవస్థను నెలకొల్పారు. అవినీతిని అరికట్టడానికైతే ఆమె పెద్ద యుద్ధమే చేశారు. చమురు దిగుమతిదారుల మాఫియాని అడ్డుకున్నందుకు ఆగ్రహించిన దుండగులు కొందరు వృద్ధురాలైన ఒకాంజొ తల్లిని అపహరించారు. మంత్రిపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఏమాత్రం బెదరలేదు. మౌనంగా ఉండిపోవడంతో అసలేం జరుగుతోందో అర్థంకాక ఐదు రోజుల తర్వాత వాళ్లే వదిలేశారు.
ఆ సాహసమే ఒకాంజొని ప్రపంచ వాణిజ్యమండలి దాకా తీసుకొచ్చింది.
అవసరమైన సంస్కరణలు తేగల సత్తా ఆమెకుందని నమ్మినందువల్లే డబ్ల్యూటీవో ఆమెను స్వాగతించింది.
ఈ రంగంలోనే మరో సంచలనం- మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్)కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితురాలవడం. అంతకుముందు అదే సంస్థలో ప్రధాన ఆర్థికవేత్త అయిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు గీత. గతంలో ఈ సంస్థ ఎండీగా చేసిన మొదటి మహిళ క్రిస్టీన్ లగార్డె ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్‌బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో స్త్రీలు ఇంత కీలక స్థానాల్లో రాణించడం ఇదే తొలి సందర్భం.
అందరి ఆరోగ్యం కోసం.. ఆమె
అరవై రెండేళ్ల వయసులో ఆమెఒంటరిగా జెనీవాలో ఉంటుంది. భర్త చెన్నైలో కొడుకు దగ్గర ఉంటే, కూతురు అమెరికాలో ఉంటుంది. ఈ నలుగురూ వారానికోసారి జూమ్ తెరమీద కలుసుకుని కబుర్లు చెప్పుకుంటారు. ఆమె ఒక్కరే అక్కడ ఎందుకున్నట్లూ అంటే- ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యం గురించీ పట్టించుకోవాల్సిన పదవి ఆమెది. కరోనా వైరస్ వచ్చినప్పటినుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ ఫలానా మందులు వాడాలనీ ఫలానా జాగ్రత్తలు తీసుకోవాలనీ మార్గదర్శకాలు జారీచేయడం చూస్తున్నాం. వాటన్నిటి వెనకాల ఓ పెద్ద శాస్త్రవేత్తల బృందం ఉంది. ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న చీఫ్ సైంటిస్ట్- భారతీయురాలైన సౌమ్యా స్వామినాథన్. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె అయిన సౌమ్య పిల్లలవైద్యురాలై పరిశోధన రంగాన్నెంచుకున్నారు. క్షయ, హెచ్‌ఐవీలకు సంబంధించిన పరిశోధనలో ఇరవయ్యేళ్లు కృషి చేశారు. భారత వైద్యమండలి డైరెక్టర్ జనరల్‌గా దేశంలో వైద్యపరిశోధనకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించేందుకు తోడ్పడ్డారు. ఈ కృషే ఆమెను ప్రపంచ ఆరోగ్య సంస్థ వరకూ తీసుకెళ్లింది. మొదట డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా నియమించినప్పటికీ తర్వాత ఆమెకోసమే ప్రధాన శాస్త్రవేత్త పదవిని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. వైద్య పరిశోధనలను సమన్వయం చేసి దేశాలన్నిటికీ మార్గదర్శకాలు ఇవ్వడం ఆమె బాధ్యత. సరిగ్గా ఆ పని మొదలుపెట్టేసరికి కరోనా విరుచుకుపడింది. 'వైరస్ మాకూ కొత్తదే. దాని గురించి ఏం చెప్పాలన్నా ముందు మేము పరిశోధించాలి. బోలెడంత సమాచారం సేకరించాలి. నిద్రాహారాలు మాని మేమా పనిలో ఉంటే- డబ్ల్యూహెచ్‌వో ఏం చేస్తోందంటూ బయట నుంచి రకరకాల విమర్శలొచ్చాయి. సైన్సు పరిశోధనని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం అంత తేలిక కాదు' అనే సౌమ్య మొత్తానికి ఆ విషయంలో విజయం సాధించారు. ఇప్పుడు ఆమెకు వచ్చే మెయిల్స్‌లో సగానికి పైగా అమ్మాయిల నుంచేనట. మిమ్మల్ని చూశాకే మాకూ పరిశోధనారంగం పట్ల ఆసక్తి పెరిగిందని వాళ్లు చెబుతోంటే చాలా సంతోషంగా ఉందంటారు సౌమ్య.
టెస్ట్ కిట్‌ల నుంచి వ్యాక్సిన్ తయారీ వరకూ కరోనాని ఎదుర్కొనడంలో అన్ని దేశాల్లోనూ మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారన్నది వాస్తవం. వారికి తగు సూచనలు అందించి మార్గదర్శకత్వం వహించిన ప్రధాన శాస్త్రవేత్తగానూ మహిళే ఉండటం... ఎందరికో స్ఫూర్తికారకం.
ఆటా పాటా...
నాలుగేళ్లకోసారి జరిగే ఆటల సంబరం- ఒలింపిక్స్. 2020లో జరగాల్సిన ఈ ఆటల పోటీలు ఏడాది ఆలస్యంగా జరిగాయి. తీవ్ర అనిశ్చితీ వైరస్ భయాల మధ్య జరిగినప్పటికీ టోక్యో ఒలింపిక్స్ చరిత్రాత్మకమైన ఒక ప్రత్యేకతను తమ పేర రాసుకున్నాయి. నూటపాతికేళ్ల ఒలింపిక్ చరిత్రలో మొట్టమొదటిసారి క్రీడాకారుల్లో స్త్రీలూ పురుషులూ దాదాపు సమంగా హాజరయ్యారు. 1896లో జరిగిన మొదటి ఒలింపిక్ క్రీడల్లో ఒక్క మహిళ కూడా పాల్గొనలేదు. 1900లో మొదటిసారి 22 మంది మహిళలు పాల్గొనగా క్రమంగా పెరుగుతూ వచ్చిన సంఖ్య 2020 ఒలింపిక్స్ నాటికి 5,386కి చేరింది. అంటే- మొత్తం క్రీడాకారుల్లో 49 శాతం వారేనన్నమాట. పోటీపడిన క్రీడాంశాలు సైతం పురుషుల(45)కన్నా స్త్రీల(46)కే ఎక్కువుండటం విశేషం. అలా సమానత్వానికి సంబంధించి ఈ ఒలింపిక్స్ కొత్త అధ్యాయాన్ని లిఖించాయి.
క్రీడలకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న మరో శుభపరిణామం- బొమ్మల్లో 'ఆడపిల్లల బొమ్మలు', 'మగపిల్లల బొమ్మలు' అని విడివిడిగా పెట్టబోమని లెగొ లాంటి ప్రముఖ సంస్థ ప్రకటించడం. ఇక ఈ సమయంలోనే అంతర్జాతీయంగా వచ్చిన మరో చెప్పుకోదగ్గ మార్పు- చలనచిత్రాల్లో శ్వేతేతర, మహిళా దర్శకులకు గుర్తింపు. 93 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో కేవలం ఏడుగురు మహిళా దర్శకులు మాత్రమే నామినేట్ కాగా అవార్డు గెలుచుకున్నది ఇద్దరే. 2010లో క్యాథరిన్ బిగెలో తర్వాత 2021లో క్లోయె జావు ఆ ఘనత సాధించింది. ఆ తర్వాత జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ మొదటిసారి ముగ్గురు మహిళా దర్శకులు నామినేట్ అవడం విశేషం. 77 ఏళ్ల ఈ అవార్డుల చరిత్రలో ఇప్పటివరకూ ఐదుగురు మాత్రమే నామినేట్ అవగా ఒక్కరే అవార్డు అందుకున్నారు. అలా 2021లో మహిళలు మరో ఇనుపతెరని ఛేదించారు.
చట్టాలే మార్చేశారు!
అత్యాచారాలూ అమానుషాలూ ఎన్ని జరుగుతున్నా స్త్రీలకు న్యాయం అన్నది అందని మానిపండుగా ఉన్న పరిస్థితి ప్రపంచమంతటా ఉంది. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలే సాక్ష్యాలు చూపించి రుజువు చేసుకోవాల్సిన దుస్థితి వల్ల నేరస్తులు చట్టానికి అందకుండా శిక్ష తప్పించుకుంటున్నారు. ప్రతిఘటించినట్లు సాక్ష్యాలు లేవు కాబట్టి ఆమె అంగీకారంతోనే సంఘటన జరిగిందని వాదిస్తే న్యాయస్థానాలు ఒప్పుకోక తప్పని పరిస్థితిని మార్చేందుకు పూనుకున్నాయి కొన్ని దేశాలు. 'యస్ మీన్స్ యస్' మోడల్‌గా పేర్కొంటున్న ఈ విధానంలో తాను అత్యాచారం చేయలేదనీ ఆమె అంగీకరించిందనీ అతడే సాక్ష్యాలు చూపించాలి. ఆమె అంగీకారాన్ని తెలిపే సాక్ష్యం అతని దగ్గర లేకపోతే అతడే శిక్షార్హుడవుతాడు. ఈ రకమైన చట్టాన్ని 11 యూరోపియన్ దేశాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. తాజాగా స్పెయిన్ కూడా అలాంటి చట్టం చేసి వాటి సరసన సగర్వంగా నిలిచింది. వీధుల్లో ఈవ్ టీజింగ్, ఆఫీసుల్లో వేధింపులూ కూడా ఇప్పుడు సాధారణ నేరాలు కాదు, తీవ్రనేరాలుగా పరిగణించి జైలుశిక్ష విధించే దిశగానూ చట్టాలు చేశాయి ఈ దేశాలు.
చిలీ దేశం మరొకడుగు ముందుకేసింది. కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంటున్న ఆ దేశం ఆ పనిచేసే రాజ్యాంగ సభలో సభ్యులుగా స్త్రీలూ పురుషులూ సమానంగా ఉండేలా చూసింది. ఒక రాజ్యాంగ సభలో ఈ జాగ్రత్త తీసుకోవడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. రాయబోయే రాజ్యాంగంలోనూ సమానత్వానికి పెద్దపీట వేసే ప్రయత్నాల్లో ఉంది ఆ దేశం.
పారిస్‌కి చెందిన 'ద జనరేషన్ ఈక్వాలిటీ ఫోరమ్' సమానత్వం దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి పెద్ద ఎత్తున కృషిచేస్తోంది. ఐదేళ్ల కార్యాచరణను గతేడాదే మొదలుపెట్టిన ఈ ఫోరమ్ ఇప్పటికే వివిధ దేశాల ప్రభుత్వాలతో, స్వచ్ఛంద, యువజన సంఘాలతో చర్చలు జరిపి మొత్తం మూడు లక్షల కోట్ల రూపాయలతో సమానత్వానికి బాటవేసే వివిధ పథకాలను అమలుచేసేలా హామీలు తీసుకుంది. అవి సక్రమంగా అమలయ్యేలా చూసే బాధ్యతను తలకెత్తుకున్నదంతా యువతరమే.
ఇంట గెలిచి రచ్చ గెలవమని నానుడి. సమానత్వ సాధనలో- సంస్థలూ ప్రభుత్వాల పాత్రే కాదు, పౌరులుగా మన బాధ్యతా విస్మరించరానిదే. నిజానికి ఏ మార్పుకైనా పునాది పడేది ఇంట్లోనే. ఎవరికి వారు పిల్లల్ని సమానంగా చూస్తే.. ఎదగడానికి సమానావకాశాలిస్తే.. తరాల దాకా ఆగాల్సిన పనేముంది.. మన కళ్లముందే సమానత్వం కల సాకారం కాదూ..!
ఎన్నేళ్లు?
స్త్రీపురుష సమానత్వానికి సంబంధించి ప్రపంచదేశాల పరిస్థితులను విశ్లేషిస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక ఏటా ఓ నివేదికను ప్రచురిస్తుంది. 2021 నివేదిక ప్రకారం సమానత్వ సాధనకు ఇంకో 136 ఏళ్లు పడుతుందని అంచనా.
- విద్యా, వైద్య రంగాల్లో మాత్రమే పరిస్థితి ఆశాజనకంగా ఉందట.
- 15- 20 ఏళ్లలోపే అంతరం పూడుకుపోయే అవకాశం ఉందట. అయితే అది సౌకర్యాలను అందుకునే విషయంలో మాత్రమే. ఆయా రంగాల్లో ఉన్నత పదవుల్లో మాత్రం అంతరం చాలానే ఉంది.
- రాజకీయ రంగంలో సమానత్వానికి 145 ఏళ్లు తేలిగ్గా పడుతుందట.
- ఈ విషయంలో అభివృద్ధిచెందిన అగ్ర దేశాలకన్నా అభివృద్ధి చెందుతున్న చిన్న దేశాలే మిన్నగా ఉన్నాయి.
- ఆర్థిక రంగంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రంగంలో సమానత్వానికి ఏకంగా 267 ఏళ్లు పడతాయని అంచనా.
- మొత్తం 156 దేశాల్లో మన దేశం 140వ స్థానంలో ఉంది. అధ్యయనాలూ అదే చెబుతున్నాయి!
- ‘స్త్రీల పట్ల వివక్ష కూడదు’ అని చెబితే సరిపోదు, వారి సామర్థ్యం ఏమిటో నిరూపించి చూపించాలనుకున్న శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు జరిపారు. వాటి ప్రకారం...
- కొవిడ్ నిర్వహణ గురించి 194 దేశాల్లో చేపట్టిన అధ్యయనంలో- గొప్ప గొప్ప దేశాలన్నీ కరోనాని కట్టడి చేయడానికి నానా ఆపసోపాలు పడుతుంటే మహిళల పాలనలో ఉన్న దేశాలు మాత్రమే చులాగ్గా దానికి ముకుతాడు వేయగలిగాయని తేలింది. అమెరికాలోనూ మహిళలు గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాల్లోనే తక్కువ మరణాలు నమోదయ్యాయట.
- కార్పొరేట్ ప్రపంచంలో స్త్రీ పురుష సామర్థ్యాలను అంచనా వేయడానికి మొత్తం 19 రకాల నైపుణ్యాల జాబితా రూపొందించి పరీక్షించారు. అందులో పదమూడింట్లో పూర్తిగా మహిళా మేనేజర్లే ముందున్నారట. ఉద్యోగులకు ప్రేరణనివ్వడం, చొరవచూపడం, కింది ఉద్యోగులను ప్రోత్సహించడం... తదితర మంచి లక్షణాల్లో స్త్రీలదే పైచేయని హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురితమైన అధ్యయనం బల్లగుద్ది చెబుతోంది.
- కొత్త, సృజనాత్మక విధానాలను త్వరగా అంగీకరించి ఆచరణలో పెట్టడంలోనూ స్త్రీలే ముందుంటారని ఒక పరిశోధన తేల్చింది.
- మహిళలు తమ ఒక్కరి గురించి కాక సమాజంలో అందరి బాగు గురించీ ఆలోచిస్తారనీ, నీతి నిజాయతీలతో కూడిన ప్రవర్తనను ప్రోత్సహిస్తారనీ మరో పరిశోధన చెబుతోంది.
- పర్యావరణ పరిరక్షణకు కృషిచేసే వారికిచ్చే 'గోల్డ్‌మన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్’ గ్రహీతలు 200 మందిలో 60 శాతం మహిళలే. నోబెల్ బహుమతుల్లో అన్నిటికన్నా ఎక్కువగా మహిళలు అందుకున్నది శాంతి బహుమతే. అందరి బాగూ కోరేది స్త్రీలేననడానికి ఇంతకన్నా ఇంకేం కావాలీ..!
ఇదీ చదవండి: తొలి మహిళా స్పేస్ టూరిస్ట్.. బెత్ మోసెస్
14జిల్లాల్లో 10మంది మహిళా కలెక్టర్లే.. కేరళ ఘనత!
Cricketer Neeragattu Anusha : నాన్న కోసమే బ్యాట్ పట్టా.. సిక్సర్ కొట్టా