ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా వయో వృద్ధులను ఈ ఏడాది చివరి వరకు నిర్బంధ పర్యవేక్షణ (క్వారంటైన్)లో ఉంచాలని భావిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య అధినేత్రి ఉర్సులా వాన్ డెర్ లేయన్ తెలిపారు. వైరస్ బారిన పడుతున్న వారిలో అత్యధికులు వయసు పైబడినవారే. ప్రస్తుతం ఈ వ్యాధికి టీకా లేనందున.. వృద్ధులతో సాధ్యమైనంత వరకు భౌతిక దూరాన్ని పాటించేలా చూస్తున్నట్లు ఆమె వివరించారు.
ఈ ప్రక్రియ కష్టమని మాకు తెలుసు. ఒంటరితనంగా ఉండటమంటే ఎంతో భారంగా ఉంటుంది. అయితే ఇది జీవన్మరణాలకు సంబంధించిన విషయం. మనమంతా క్రమశిక్షణతో, ఓర్పును కలిగి ఉండాలి.
ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు
వృద్ధులతో పోలిస్తే.. పిల్లలు, యువకులు చికిత్సకు త్వరగా కోలుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఐరోపా పరిశోధన సంస్థలు వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తాయని ఉర్సులా ఆశాభావం వ్యక్తం చేశారు.