బ్రిటన్‌లో తమ సంస్థను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ మేరకు బ్రిటన్‌లో జీబీపీ 240 మిలియన్లు(రూ.24,59,10,31,392) పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొంది. ఇది.. భారత్-బ్రిటన్ 1 బిలియన్ వ్యాపార ఒప్పందంలో భాగమని వెల్లడించింది.
బ్రిటన్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిన 20 దిగ్గజ వ్యాపార సంస్థల్లో సీరం ఒకటి కావడం గమనార్హం.
భారత్‌లో కొవిషీల్డ్ టీకాను పంపిణీ చేస్తున్న సీరం.. ప్రస్తుతం బ్రిటన్‌లో.. ముక్కు ద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. ఈ టీకా మొదటి దశ ట్రయల్స్ జరుపుతున్నట్లు వెల్లడించింది.
'ఈ పెట్టుబడులతో పరిశోధన, క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ తయారీపై సీరం దృష్టిసారిస్తుంది. బ్రిటన్‌లో, ప్రపంచదేశాల్లో కరోనా మహమ్మారిని అంతమొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. కొడాజెనిక్స్ ఐఎన్‌సీ, సీరమ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒకే డోసు కొవిడ్ వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్స్‌లో ఉంది,' అని డౌనింగ్ స్ట్రీట్ పేర్కొంది.
మరోవైపు.. రానున్న ఐదేళ్లలో బ్రిటన్‌లో 59 మిలియన్ బ్రిటీష్ పౌండ్ల పెట్టుబడి పెట్టనున్నట్లు భారత ఔషధ సంస్థ గ్లోబల్ జీన్ కార్ప్ పేర్కొంది. 110 ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు కల్పించనుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:బస్సు ప్రమాదం-11 మంది మృతి