Russian strikes hit Kyiv, Lviv: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తోంది. శుక్రవారం రోజు కూడా కీవ్, లవీవ్ సహా ఇతర ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు, షెల్లింగ్లతో విరుచుకుపడింది రష్యన్ సైన్యం. నివాస ప్రాంతాలు, ఆస్పత్రులు, స్కూళ్లపై దాడులు చేస్తోందని రష్యాపై ఒత్తిడి పెంచుతున్నాయి ప్రపంచ దేశాలు.
పశ్చిమ ప్రాంతంలోని లవీవ్ విమానాశ్రయం లక్ష్యంగా.. మాస్కో సేనలు క్షిపణి దాడులు చేశాయి. అయితే ఈ క్షిపణులు సమీపంలో పడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ దాడితో పెద్దఎత్తున మంటలు చెలరేగి.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసినట్లు పేర్కొన్నాయి. విమానాశ్రయానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపాయి. లవీవ్‌లో ఉదయం 6 గంటల ప్రాంతంలో.. మొత్తం 3 పేలుళ్లు వినిపించాయని ఓ సైనికుడు తెలిపాడు. పేలుళ్ల ధాటికి భవనాలు కంపించాయని, ప్రజలు వణికిపోయారని చెప్పాడు.
మరియుపోల్ సిటీ సెంటర్‌లో రష్యా దాడులు..
రష్యా దళాలు శుక్రవారం డొనెట్క్స్ వేర్పాటువాద బలగాలతో కలిసి ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నడిబొడ్డులో పోరాడుతున్నాయని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. మరియుపోల్ నుంచి వేలాది పౌరులు.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం.. యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి 30 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ వాసులు దేశాన్ని విడిచివెళ్లారని తెలుస్తోంది. మొత్తం మృతుల సంఖ్యపై స్పష్టత లేదు. వేలాది మంది చనిపోయి ఉంటారని సమాచారం.
అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఉక్రెయిన్‌పై.. రష్యా దాడిని ఆపాలని సంయుక్త ప్రకటన చేశాయి జీ-7 దేశాలు. మరోవైపు.. ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోబోమని ప్రతిజ్ఞ చేయాలని రష్యా డిమాండ్ చేస్తోంది.
రష్యా యుద్ధనేరానికి పాల్పడుతోందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపించాయి. ఆస్పత్రులు, ఇతర ఆరోగ్య కేంద్రాలపై 43 దాడులు జరిగినట్లు డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరించింది. ఈ ఘటనల్లో 12 మంది పౌరులు మరణించారని, 34 మంది గాయపడ్డారని పేర్కొంది.
UK regulator revokes RT licence:
రష్యా టుడే ఛానల్ లైసెన్స్ రద్దు..
రష్యాపై వేర్వేరు దేశాలు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ ప్రసార నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్.. రష్యా ప్రభుత్వ నిధులతో నడిచే టెలివిజన్ ఛానెల్ రష్యా టుడే(ఆర్టీ) లైసెన్స్‌ను రద్దు చేసింది. 'బ్రిటన్‌లో ప్రసారానికి అనుమతించే ఆర్‌టీ లైసెన్స్‌ను ఆఫ్‌కామ్ ఈ రోజు రద్దు చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది' అని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తమ దేశంలో పనిచేయడానికి ఈ ఛానల్ ఫిట్, సరైనది కాదని పేర్కొంది.
ఆస్ట్రేలియా, జపాన్ మరిన్ని ఆంక్షలు..
రష్యాను నిలువరించేందుకు ఆస్ట్రేలియా, జపాన్ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించాయి. రష్యన్ బిలియనీర్లు ఒలేగ్ డెరిపాస్కా, విక్టర్ వెక్సెల్‌బర్గ్ సహా 11 బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలను ఆస్ట్రేలియా తన ఆంక్షల జాబితాలో చేర్చింది.
జపాన్.. మరో 15 మంది రష్యన్‌లతో పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయుధ ఎగుమతిదారు రోసోబోరోన్ ఎక్స్‌పోర్ట్‌తో సహా తొమ్మిది సంస్థలపై ఆంక్షలు విధించింది.
రాజకీయం చేయొద్దు..
Legitimate Energy Transactions: భారత ఇంధన లావాదేవీలకు సంబంధించి.. రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. రష్యా నుంచి రాయితీలో ముడిచమురును భారత్ కొనుగోలు చేయనుందన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ఇవీ చూడండి: పుతిన్ యుద్ధ నేరస్థుడా? శిక్షించడం సాధ్యమేనా?