3 విమానాల్లో స్వదేశానికి
యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు దాదాపు కొలిక్కి వచ్చింది. శుక్రవారం మూడు విమానాల్లో 674 మంది విద్యార్థులు దిల్లీకి చేరుకున్నారు. సుమీ నగరంలో చిక్కుకుపోయిన వీరందరినీ క్షేమంగా తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంపై వారందరూ హర్షం వ్యక్తం చేశారు. తొలుత రెండు విమానాల్లో(ఎయిర్ ఇండియా, ఇండిగో) 461 మంది విద్యార్థులు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
భారత వాయుసేనకు చెందిన ఐఏఎఫ్ సి-17 విమానం 213 మందితో హిందాన్ ఎయిర్ బేస్‌లో దిగింది. విమానాశ్రయాల వెలుపలకు వచ్చి తమ తల్లిదండ్రులను, బంధుమిత్రులను కలుసుకోగానే విద్యార్థులందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు హత్తుకుని ఆనంద భాష్పాలు రాల్చారు. కొందరు తల్లిదండ్రులు మిఠాయిలు పంచగా, మరికొందరు పూలమాలలతో తమ బిడ్డలకు స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై నినాదాలు మార్మోగాయి. 'ప్రాణాలతో భారత్‌కు తిరిగి వస్తానని అనుకోలేదు. సుమీలోని బంకర్లలో నరకం అనుభవించాం. తాగేందుకు నీరు లేదు. తినేందుకు తిండి లేదు. నీటి కోసం మంచు కరిగించుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి బయటపడడానికి రెండు వారాలు పట్టింది' అని విద్యార్థులు ధ్రువ్ పండిత, విరాధ లక్ష్మి తదితరులు వివరించారు.