Olena Zelenska: 'నా శత్రువు మొదటి గురి నేను. ఆ తర్వాత నా కుటుంబం' అని ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. అయినా సరే.. ఆయన కుటుంబం స్వదేశంలోనే ఉండిపోయింది. మా దేశం రండి అంటూ ప్రపంచ దేశాలు ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించింది. శత్రువు పడగవిప్పి బుసకొడుతున్నా సరే.. అక్కడే ఉండేలా ఆయన్ను ప్రేరేపించింది మాత్రం వొలెనా జెలెన్‌స్కా. ఆమె జెలెన్‌స్కీ సతీమణి, ఆ దేశ ప్రధమ మహిళ. జెలెన్‌స్కీ దేశం విడిచిపారిపోయారంటూ గిట్టని వాళ్లు వదంతులు వ్యాప్తి చేసినా.. 'లేదు నా భర్త ఇక్కడే ఉన్నాడు. ఆయన వెంట నేను ఉన్నాను. ఈ ప్రజల వెంట నేనుంటాను' అంటూ ధైర్యంగా చెప్తున్న ఆమె గురించి తెలుసుకుందామా..!
దృఢ వైఖరి..
తన భర్త నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారతానంటే అయిష్టం వ్యక్తం చేసిన జెలెన్‌స్కీ సతీమణి వొలెనా (44).. ఇప్పుడు ప్రతి అడుగులో ఆయన వెంటే నడుస్తున్నారు. శత్రువు కఠినంగా వ్యవహరిస్తున్నా.. దేశం విడిచి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. తన పిల్లలతో సహా ఇక్కడే ఉండిపోయారామె. 'నాకు భయం లేదు. కన్నీరు రాదు. నేను ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటాను. నా పిల్లలు నా వైపు చూస్తున్నారు. నేను వారి పక్కన ఉండాలి. నా భర్త పక్కన ఉండాలి. అలాగే ఈ దేశ ప్రజల చెంత ఉండాలి' అంటూ పెను ప్రమాదంలో దృఢ వైఖరి ప్రదర్శిస్తున్నారు. జెలెన్‌స్కీ నటుడిగా, దేశాధ్యక్షుడిగా ఎప్పుడూ తెరపైనే ఉన్నారు. ఆమె మాత్రం తెర వెనకే ఉండి, తన పనితాను చేసుకోవడానికి ఇష్టపడేవారు. అయితే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో మాత్రం తన మాటలతో ప్రపంచం దృష్టిలో పడ్డారు.
ఆర్కిటెక్చర్ చదివిన జెలెన్‌స్కా.. తదనంతర కాలంలో రచయితగా తన అభిరుచిని కొనసాగించారు. ఆమె, జెలెన్‌స్కీ చిన్నప్పటి నుంచే కలిసి చదువుకున్నప్పటికీ.. కళాశాల స్థాయిలోనే వీరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం.. 2003లో వివాహానికి దారితీసింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. నటుడిగా కెరీర్‌ను వదిలి, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం మొదలు పెడతానని జెలెన్‌స్కీ అనగానే వొలెనా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే, రాజకీయ నేత నుంచి అధ్యక్షుడిగా ఎదిగే క్రమంలో ఆయన వెంటే ఉండి నడిపించారు.
ఫ్యాషన్‌పై మక్కువ..
2019లో భర్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాకా.. ఆమె కూడా ప్రథమ మహిళ స్థానంలో ఇమిడిపోయారు. తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై లింగ వివక్షకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు, వినిపిస్తున్నారు. దేశ భవిష్యత్తు అయిన చిన్నారులకు పోషకాహారం అందించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. అధ్యక్షుడితో కలిసి చేస్తోన్న పర్యటనల్లో భాగంగా ఈ విషయాన్ని జపాన్ నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు. అందుకే విదేశీ పర్యటనలు కొత్త విషయాలు తెలుసుకునే సందర్భాలంటారామె. ఉక్రెయిన్ ప్రజలందరికీ సమాన అవకాశాలు, కల్చరల్ డిప్లమసీ ఆమె ప్రాధాన్యాంశాలు. ఫ్యాషన్ మీద ఆమెకు మక్కువ ఎక్కువే. విదేశీ పర్యటనల్లో భాగంగా ఆమె ధరించిన దుస్తులకు ప్రశంసలు దక్కుతాయి. అయితే ఆమె ఉక్రెయిన్‌లో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇదంతా ఒకెత్తు కాగా.. ప్రస్తుతం ఆమె తన దేశం కోసం నిలబడిన తీరు అభినందనీయం.
ప్రస్తుతం రష్యా దాడితో ఎంతోమంది ఉక్రెయిన్ పౌరులు.. పరాయి దేశాల వైపు పరుగులు పెడుతున్నారు. ఎన్నో మరణాలు నమోదవుతున్నాయి. కానీ ఆమె ఈ సమయంలో ఆ దేశంలోనే ఉంటూ.. తన దేశం కోలుకునే దిశగానే దృష్టి సారిస్తున్నారు. 'ఈ శిశువు కీవ్ బాంబ్ షెల్టర్‌లో జన్మించాడు. ఈ జననం ప్రశాంత వాతావరణంలో జరగాల్సింది. యుద్ధం జరుగుతున్నా వైద్యులు, సిబ్బంది ఆ తల్లిని జాగ్రత్తగా చూసుకున్నారు' అంటూ ఆమె ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఈ క్లిష్ట సమయంలో ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ప్రశంసించారు. ప్రజలు నిస్సహాయ స్థితిలోకి జారకుండా మాటలతో ధైర్యం చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె ఉక్రెయిన్‌లోని ఉన్నప్పటికీ.. కచ్చితంగా ఎక్కడున్నారో తెలియడం లేదు. ఇక ఉక్రెయిన్, రష్యా పోరు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఆ ఉద్రిక్త పరిస్థితులు ఇరు దేశాలకు, అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు మిగులుస్తాయోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది..!
ఇదీ చూడండి: ఆర్థిక ఆంక్షలతో 'పుతిన్' ఉక్కిరిబిక్కిరి- చైనా తోడున్నా..!