RUSSIA UKRAINE WAR: ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఆ దేశం చుట్టూ సుమారు లక్షన్నర మంది రష్యా సైనికులు ఇప్పటికే మోహరించారు. పరిస్థితి రోజురోజుకూ చేయి దాటుతున్న తరుణంలో... తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలకు తమ బలగాలను పంపుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీచేశారు! దీంతో రష్యా దండయాత్ర తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి... రష్యా ఏయే మార్గాల్లో ఉక్రెయిన్‌పై దాడులు చేయవచ్చు? అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రసిద్ధ యుద్ధ వ్యూహకర్తలు ఈ విషయమై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. వారి అంచనాల ప్రకారం ప్రధానంగా మూడు మార్గాల్లో దాడులు జరగవచ్చని భావిస్తున్నారు.
Russia Invasion:
1. తూర్పు ప్రాంతం నుంచి...
ఉక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్స్క్, దొనెట్స్క్‌లను స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతాలుగా గుర్తించిన పుతిన్... శాంతిసేనల పేరుతో అక్కడికి తన బలగాలను పంపారు.
- రష్యా సైనికులు దొనెట్స్క్ నుంచి ఉక్రెయిన్‌లోని నిప్రో, జపోరిఝాఝియాలకు చొచ్చుకువెళ్లే అవకాశముందని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిపుణులు భావిస్తున్నారు.
- ఇక రష్యాలోని రొస్తోవ్-ఆన్-డాన్ నుంచి ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు, చొరబాట్లకు పాల్పడవచ్చు.
- ఇప్పటికే వందలమంది సైనికులు మోహరించిన బెల్గరొడ్‌లోని సరిహద్దు ప్రాంతం నుంచి క్రెమెన్‌చుక్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయవచ్చు.
2. బెలారస్ కేంద్రంగా
ఒకవేళ ఉక్రెయిన్ సర్కారును పూర్తిగా పడగొట్టాలని రష్యా భావిస్తే... రాజధానిపై ఉత్తర ప్రాంతం నుంచి ముప్పేట దాడికి పాల్పడవచ్చని అమెరికా కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ నావల్ అనాలసిస్ పేర్కొంది. ఈ వ్యూహాన్ని అమలుచేస్తే, బెలారస్ కేంద్రంగా రష్యా దాడులు చేపట్టే అవకాశముంది. ఇప్పటికే 30 వేల మంది సైనికులను అక్కడ మోహరించింది. రష్యాలోని నోవీ యుకోవిచి, ట్రోబోర్ట్నో ప్రాంతాలతో పాటు బెలారస్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మెరుపు దాడులకు దిగవచ్చు.
3. కిమియా మీదుగా
రష్యా 2014లో ఆక్రమించుకున్న క్రిమియా నుంచి ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చన్నది ఇప్పటికే స్పష్టమవుతోంది. ఉత్తర, పశ్చిమ, తూర్పు భూభాగాలతో పాటు... క్రిమియా నుంచి కూడా రష్యా సేనలు చుట్టుముట్టడం వల్ల ఉక్రెయిన్ బలగాలు మధ్యలో చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. పశ్చిమ ప్రాంతంలోని ఒడెసా; తూర్పు ప్రాంతంలోని మెలిటోపోల్, మేరియపొల్‌లను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చని బ్రిటిష్ సైనిక వ్యూహకర్త బారీ విశ్లేషించారు. ఇప్పటికే నల్ల సముద్రంలో మోహరించిన రష్యా నౌకా దళాలు... క్రిమియా నుంచి జరిగే దాడుల్లో పాల్గొనే అవకాశముంది. సైనికులను, యుద్ధ ట్యాంకులను, సామగ్రిని చేరవేయడానికి ఈ నౌకలు అనువుగా ఉన్నాయి.
ఏకకాలంలో, భిన్న మార్గాల్లో...
ఉక్రెయిన్‌పై రష్యా ఏకకాలంలో, విభిన్న మార్గాల్లో దాడులు చేయవచ్చని కూడా యుద్ధ నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: రష్యాపై ఈయూ ఆంక్షలు.. పుతిన్ సాయం కోరిన ఉక్రెయిన్ రెబల్స్