Russia Ukraine War: రష్యా సేనలు ఉక్రెయిన్‌పై భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. రాజధాని కీవ్ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబులతో విరుచుకుపడుతున్నాయి. కీవ్ వాయవ్య శివారు ప్రాంతాలపై రష్యా సేనలు ఫిరంగి దాడులు చేశాయని, తూర్పు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని కీవ్ అధికారి ఒలెక్సీ కులేబా సోమవారం తెలిపారు. రష్యా దళాలతో పోరాడుతూ తూర్పు బ్రోవరీ పట్టణ కౌన్సిలర్ ప్రాణాలు కోల్పోయిట్లు టీవీ ఛానల్‌కు వెల్లడించారు. ఇర్పిన్, బుచా, హస్టోమెల్లో క్షిపణి దాడులు జరిగాయని వివరించారు.
అయితే తాము తీవ్రంగా ప్రతిఘటించడం వల్ల భీకర దాడులు చేస్తున్నప్పటికీ రష్యా దళాలు గత 24 గంటల్లో ఎక్కువ దూరం ముందుకు కదల్లేకపోయాయని ఉక్రెయిన్ సైన్యాధికారులు చెప్పారు. రష్యా స్థావరాలు, వాహన శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు పెర్కొన్నారు. తమ దళాలు ఎదురు కాల్పులు జరపకుండా చర్చీలు, మౌలిక సదుపాయాలు గల ప్రాంతాల్లో రష్యా బలగాలు ఫైరింగ్ పొజిషన్లు, సైనిక పరికరాలను ఏర్పాటు చేశాయని ఆరోపించారు.
Russia Ukraine Latest news
అపార్ట్‌మెంట్‌పై క్షిపణి దాడి..
పశ్చిమ కీవ్‌లోని ఒబొలొన్స్కీ జిల్లాలో 9 అంతస్తుల అపార్ట్‌మెంట్‌పై సోమవారం ఉదయం రష్యా క్షిపణి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ధాటికి భవనంలోని కొన్ని ఫ్లోర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అధికారులు విడుదల చేశారు..
Pregnant Woman Dead in Russia Attack
నిండు గర్భిణి మృతి..
బుధవారం మరియుపోల్‌లోని ఓ ప్రసూతి ఆస్పత్రిపై రష్యా బాంబుదాడి చేసిన ఘటనలో నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన సమయంలో ఘటన జరిగింది. దాడి అనంతరం మహిళ తీవ్ర గాయలపాలైంది. క్షణాల్లో జరిగిన విధ్వంసం చూసి షాక్‌కు గురైంది. ఆమెను కాపాడేందుకు వేరే ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు సిజేరియన్ చేశారు. కానీ బిడ్డలో కదలిక లేదు. కాసేపటికే తల్లి కూడా చనిపోయింది. బిడ్డ చనిపోతుందని తెలిసి ఆ మహిళ తనను కూడా చంపేయాలని అరిచిందని వైద్యులు తెలిపారు. కానీ చివరకు ఇద్దరు మరణించినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి నుంచి ఆమె భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు భర్త, తండ్రి వెళ్లారు.
గర్భిణి మృతికి సంబంధించిన దృశ్యాలను అమెరికా వార్తా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్లు రష్యా దాడులకు అమాయక ప్రజలు ఎలా బలవుతున్నారో తెలిపేందుకు ఇదే నిదర్శనమంటున్నారు. నిండు గర్భిణి పరిస్థితి చూసి చలించిపోయారు.
Russia Attack on Ukraine
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సోమవారంతో 19వ రోజుకు చేరింది. రెండు దేశాలు ఇప్పటికే మూడు సార్లు శాంతి చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు.
ఇదీ చదవండి: 'ఉక్రెయిన్‌పై యుద్ధంలో చైనా సాయం కోరిన రష్యా'