Russia attack Ukraine: ఉక్రెయిన్పై సైనిక చర్యను ప్రారంభించిన రష్యా ఆ దేశ రాజధానిని హస్తగతం చేసుకునేందుకు వేగంగా దూసుకెళ్తోంది. నగరానికి మూడు వైపుల నుంచి యుద్ధ ట్యాంకులు, బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే కీవ్ నగరంలో బాంబుల మోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా దాడుల నేపథ్యంలో పశ్చిమ దేశాల నేతలు అత్యవసర సమావేశం కానున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలని దాడులు చేస్తున్న రష్యాను నిలువరించాలని ఉక్రెయిన్ అద్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కోరారు. ఈ క్రమంలో ఆ దేశ రాజధానిని వీలైనంత తొందరగా స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
5 కిలోమీటర్ల దూరంలో..
ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ రాజధాని ప్రమాదపుటంచున ఉన్నట్లు స్పష్టమవుతోంది. రష్యాకు చెందిన బలగాలు, చొరబాటుదారులు రాజధానికి ఉత్తరం వైపు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని తాజాగా ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. అంతకుముందు రెండు ఉక్రెయిన్ మిలిటరీ వాహనాలను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి సైతం ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ రాజధాని రష్యా అధీనంలోకి వెళ్లవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రాజధానే లక్ష్యం- ఏ క్షణమైనా రష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్