సుదీర్ఘ కాలంగా రష్యాను ఏలుతున్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. పుతిన్ వచ్చే జనవరి నెలలోనే రష్యా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే అవకాశం ఉందని బ్రిటన్ మీడియా పేర్కొంది. అయితే, అనారోగ్య కారణాల వల్లే పుతిన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ వార్తలను రష్యా ఖండించింది.
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ గతకొన్ని రోజులుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. అందుకే ఆయన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యులు కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు భావిస్తున్నారు. పుతిన్‌లో కొన్నిరోజులుగా అరుదైన పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు కనిపించాయని మాస్కోకు చెందిన రాజకీయ విశ్లేషకులు వెల్లడించారని బ్రిటన్ మీడియా పేర్కొంది.
ఈమధ్య అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలోనూ పుతిక్ కాళ్లు, చేతులు వణికినట్లు వెల్లడించారు. అంతేకాకుండా పెన్నుతో రాసే సమయంలో, టీ తాగుతున్నప్పుడు కూడా పుతిన్ చేతి వేళ్లు వణుకుతున్నట్లు గుర్తించామని రష్యా రాజకీయ విశ్లేషకుడు మీడియాతో చెప్పారు. అందుకే త్వరలోనే అధికార బాధ్యతలు మరొకరికి అప్పగించే యోచనలో పుతిన్ ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
పుతిన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు..
తాజాగా ఈ వార్తలను రష్యా ఖండించింది. బ్రిటన్ మీడియా కథనాలు అవాస్తవమని.. అధ్యక్షుడు పుతిన్ పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నారని రష్యా అధ్యక్ష భవనం(క్రెమ్లిన్) అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఓ వార్తా సంస్థతో స్పష్టం చేశారు.