అడుగు తీసి అడుగేస్తే మర్యాదలు.. అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందలమంది సిబ్బంది.. దేశంలో పాపులర్ ఫిగర్‌గా గుర్తింపు.. ఇవన్నీ ఎవరు వదులుకుంటారు? బ్రిటీష్ ప్రిన్స్ హ్యారీ వదులుకున్నారు. గతేడాది జనవరిలో 'నేను రాచకుటుంబాన్ని వదిలి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కి వెళ్లిపోతున్నా' అని హ్యారీ ప్రకటించినప్పుడు ప్రపంచం ముక్కున వేలేసుకుంది. కొందరైతే అది గొప్ప త్యాగం అన్నారు. కానీ, తను ఎందుకిలా చేశారో.. ఎవరికీ తెలియదు. ఆయనా బయటపెట్టలేదు.
'బ్రిటీష్ మీడియా పెట్టే మానసిక హింస తట్టుకోలేకే నేనిలా చేశా' అంటూ తాజాగా ఓ ప్రైవేటు టెలివిజన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి మరో సంచలనానికి తెర తీశాడు హ్యారీ. రాచరికం కట్టుబాట్లు, విలాసాలు ఓ గుదిబండలా మారాయనీ, రాయల్ లైఫ్ ఒత్తిడిని భరించలేకపోయాననీ, అనుక్షణం డేగకళ్లతో గమనిస్తూ కథనాలు అల్లే మీడియా టార్చర్ భరించలేకనే భార్య మేగన్ మార్‌క్లేని వదిలి అమెరికా వెళ్లిపోయానని చెప్పాడు. రాచకుమారుడిగా హ్యారీకి సవాలక్ష ఆంక్షలుండేవి. రాజభవనం దాటి బయటికెళ్లాలంటే అతి జాగ్రత్తలు ఉండేవి. లాస్‌ఏంజెల్స్‌లో నివాసం ఏర్పరచుకున్నాక తను స్వేచ్ఛగా విహరిస్తున్నారు. తరచూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ ఇంటర్వ్యూకి ముందు ఓపెన్ టాప్ బస్సులో ప్రయాణించారు.