భూమిపై మానవ మనుగడకు అత్యంత ప్రధానమైనవి చెట్లు. కానీ, మనుషుల విపరీత చర్యల వల్ల ఆ వృక్ష సంపదే(Tree Species).. కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది. ప్రపంచంలో ఉన్న మొత్తం వృక్షజాతుల్లో మూడింట ఒకవంతు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం.. గ్లోబల్ ట్రీ అసెస్మెంట్ సంస్థ(Global Tree Assessment) రూపొందించిన ఓ నివేదికలో వెల్లడైంది. భూమిపై ఉన్న చెట్లపై.. అధ్యయనం చేసి, తయారు చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం.
మంగోలియాస్, ఓక్స్, మేపుల్స్ వంటి వృక్షాలకు కూడా అంతరించిపోయే ముప్పు ఉన్నట్లు ఈ నివేదికలో తేలింది. 400కుపైగా వృక్ష జాతుల్లో.. ఆ చెట్ల సంఖ్య 50 కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మరోవైపు.. ఇప్పటికే 142 వక్ష జాతులు(Tree Species) అంతరించిపోయాయి. వ్యవసాయం కోసం అడవులను నరికివేయడం, కలప కోసం చెట్లను నరకడం వంటి మానవ చర్యలు సహా తెగుళ్లు, వ్యాధులు వంటివి సోకడం కారణంగా చెట్లు అంతరిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
ఎలా అధ్యయనం చేశారు..
ప్రపంచ వ్యాప్తంగా 500 మంది నిపుణులతో ఓ గ్లోబల్ నెట్వర్క్ను తయారు చేసి.. వృక్ష జాతులపై అధ్యయనం చేసినట్లు పరిశోధనలో పాల్గొన్న వారిలో ఒకరైన బ్రిటన్లోని బౌర్న్మెర్త్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆర్డియన్ న్యూటన్ తెలిపారు. ఈ అధ్యయనం పూర్తి చేసేందుకు 5 సంవత్సరాలు పట్టిందని చెప్పారు.
వక్ష జాతులు హరించిపోతున్నందున.. అటవీ పర్యావరణ వ్యవస్థ ప్రమాదంలో పడిందని న్యూటన్ తెలిపారు. అడవులను, వృక్ష జాతులను(Tree Species) రక్షించడం ద్వారా... వాతావరణ మార్పులను కట్టడి చేయడం సహా జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రమాదంలో ఉన్న వృక్షాలను రక్షించడం సహా అంతరించిపోతున్న అడవులను కాపాడేందుకు ప్రపంచం అత్యవసరంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఇదీ చూడండి: Covid-19: కొవిడ్ పుకార్లు భారత్‌లోనే ఎక్కువ..!
ఇదీ చూడండి: అంతరిక్షంలో ప్రైవేట్ రైడ్ షురూ.. చరిత్రలో తొలిసారి!