బ్రిటన్ పౌరులపై భారత్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భారత్ ప్రయాణికులపై అమలు చేస్తున్న నిబంధనలను (Britain Covid Rules) సడలిస్తున్నట్లు వెల్లడించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు యూకేలో క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ హైకమిషనర్ ప్రకటన విడుదల చేశారు. అక్టోబరు 11 నుంచి ఈ సడలింపు అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి బ్రిటన్ వెళ్లే వారికి 10రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు పెట్టిన నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. బ్రిటన్ వైఖరికి బదులుగా భారత్ కూడా ఈనెల 4 నుంచి ఆ దేశ పౌరులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక విదేశీ పర్యాటకులు భారత్‌కు రావొచ్చు!
విదేశీ పర్యాటకులకు విధించిన కొవిడ్ నిబంధనలు ఎత్తివేసి వారికి పర్యాటక వీసాలను మంజూరు చేయాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భారత్‌ను సందర్శించాలనుకునే విదేశీయులకు నవంబర్ 15 నుంచి తాజాగా పర్యాటక వీసాలను మంజూరు చేస్తామని పేర్కొంది. అయితే, ఛార్టర్డ్ విమానాల్లో వచ్చే వారికి అక్టోబర్ 15 నుంచే వీసాల మంజూరు ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
"కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గతేడాది మంజూరు చేసిన వీసాలను నిలిపివేశాం. అంతర్జాతీయ ప్రయాణాలతో కొవిడ్ మరింత విజృంభిస్తుందనే ఉద్దేశంతో ప్రయాణ ఆంక్షలు విధించాం. ప్రస్తుతం కొవిడ్ కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విదేశీయులు ఇండియాకు రావడానికి పర్యాటక వీసాలనే కాకుండా ఇతర భారతీయ వీసాలను మంజూరు చేస్తాం" అని ప్రకటనలో పేర్కొంది.
కాగా.. దీనిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే ప్రయాణ ఆంక్షలను సడలించాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను విదేశీ పర్యాటకులు తప్పక పాటించేలా మార్గదర్శకాలు ఉండాలని రాష్ట్రాలు కోరాయని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి : భారతీయ ఐటీ నిపుణుల వీసా ప్రాసెసింగ్‌కు లైన్ క్లియర్!