ఒక వ్యక్తిలో మానసిక గందరగోళంతో పాటు జ్వరం కూడా వస్తే అది కొవిడ్-19 ప్రారంభ లక్షణం కావొచ్చని స్పెయిన్ శాస్త్రవేత్తల పరిశోధన పేర్కొంది. ముఖ్యంగా వయో వృద్ధుల్లో ఈ పరిస్థితి తలెత్తవచ్చని వివరించింది.
కొవిడ్ బాధితుల్లో దగ్గు, శ్వాస సంబంధ రుగ్మతలు రావడానికి ముందు వాసన, రుచి సామర్థ్యం తగ్గిపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ దశలో కొందరిలో మానసిక గందరగోళం కూడా తలెత్తవచ్చని చెప్పారు. ఈ సమస్యకు జ్వరం కూడా తోడైతే దాన్ని కొవిడ్‌కు సంబంధించిన ప్రాథమిక లక్షణంగా అనుమానించాలని పరిశోధనకు నాయకత్వం వహించిన జేవియర్ కొరియా తెలిపారు. కొవిడ్-19తో మెదడుపై పడే ప్రభావాన్ని విశ్లేషిస్తూ సాగిన అనేక పరిశోధనలను మదించి ఈ విషయాన్ని తేల్చామని పేర్కొన్నారు.
" మెదడుపై కరోనా ప్రభావానికి మూడు కారణాలున్నాయి. అవి... ఆక్సిజన్ కొరతతో తలెత్తే హైపాక్సియా, తీవ్ర ఇన్ఫెక్షన్ వల్ల కలిగే 'సైటోకైన్ తుపాను'తో మెదడు కణజాలంలో ఇన్ఫ్లమేషన్ రావడం, రక్తం-మెదడు అవరోధాన్ని అధిగమించి నేరుగా మెదడులోకి చొరబడే సామర్థ్యం వైరస్‌కు ఉండటం. వీటిలో ఏదో ఒక కారణం వల్ల బాధితుల్లో మానసిక గందరగోళం కలగొచ్చు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను పరిశీలించినప్పుడు హైపాక్సియా వల్ల మెదడు దెబ్బతినడాన్ని గమనించాం".
-జేవియర్ కొరియా, శాస్త్రవేత్త.
ఇదీ చదవండి:అమెరికా ఎన్నికల్లో యువత తీర్పే కీలకం!