కొవిడ్-19 నుంచి దీర్ఘకాల రక్షణపై అయోమయం నెలకొంది. కరోనా వైరస్ సోకాక బాధితుల్లో ఉత్పన్నమయ్యే రక్షణాత్మక యాంటీబాడీల సంఖ్య వేగంగా పడిపోతోందని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. వీరు ఇంగ్లండ్‌లో 3.6 లక్షల మందిపై పరిశీలన జరిపారు. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు కొద్ది నెలలు మాత్రమే శరీరంలో కొనసాగుతున్నట్లు తేల్చారు.
"సీజనల్‌గా వచ్చే సాధారణ రకం కరోనా వైరస్లు ప్రతి శీతాకాలంలోనూ ఉత్పన్నమవుతుంటాయి వీటివల్ల సాధారణ జలుబు తలెత్తుతుంటుంది. ఆ వైరస్లు 6-12 నెలల తర్వాత తిరిగి సదరు వ్యక్తిలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంటాయి" అని పరిశోధనలో పాల్గొన్న వెండీ బారే పేర్కొన్నారు. తాజా కరోనా వైరస్ విషయంలోనూ మానవ శరీరం ఇలాగే స్పందించొచ్చని ఆమె తెలిపారు. యాంటీబాడీలు కలిగి ఉన్నవారి సంఖ్య నానాటికీ తగ్గిపోవడాన్ని తాము గమనించామన్నారు.
శరీర రోగ నిరోధక స్పందనల్లో యాంటీ బాడీలు చాలా కీలకం. అయితే యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన కొవిడ్-19 నుంచి రక్షణ ఉన్నట్లు కాదని మరో శాస్త్రవేత్త పాల్ ఎలియోట్ తెలిపారు.
"యాంటీ బాడీలు ఎంత మేర, ఎంతకాలం పాటు రక్షణ కల్పిస్తాయన్నది స్పష్టంగా తేలలేదు. యాంటీబాడీలు ఉన్నప్పటికీ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, వ్యాధి లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవడం వంటి కరోనా మార్గదర్శకాలను పాటించాల్సిందే"
-పాల్ ఎలియోట్, శాస్త్రవేత్త
ఇంగ్లండ్‌లోని అన్ని వర్గాల్లో యాంటీబాడీల తగ్గుదల కనిపించినప్పటికీ ఆరోగ్య పరిరక్షణ సిబ్బందిలో మాత్రం ఆ పోకడ కనిపించలేదన్నారు పాల్. దీన్ని బట్టి వారు పదేపదే వైరస్ తాకిడికి గురవుతున్నట్లు స్పష్టమవుతోందని చెప్పారు.