కరోనా సంక్షోభంతో కష్ట కాలంలో ఉన్న మాతృదేశానికి అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు లండన్లోని ప్రవాస భారతీయులు. ఇందుకోసం తమ వంతు సాయంగా విరాళాల సేకరించాలని నిర్ణయించారు లండన్లోని శ్రీ నారాయణస్వామి దేవాలయ వలంటీర్లు. ఇరుదేశ రాజధానులైన 'దిల్లీ-లండన్' మధ్య సైకిల్ తొక్కడం ద్వారా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం బైకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అయితే వారు నిజంగా దిల్లీకి వెళ్లరు. వర్చువల్గా సంఘీభావ 'బైకథాన్' పాల్గొని.. అందుకయ్యే ప్రయాణ ఖర్చును మాత్రం విరాళంగా అందిస్తారు. ఇందులో పాల్గొనే వారు లండన్ నుంచి దిల్లీకి ఉండే సుమారు 7,600 కిలోమీటర్ల దూరాన్ని 48 గంటల్లో పూర్తి చేస్తారు. ద్వారా 5,00,000 ఫౌండ్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు సైతం పాల్గొన్నారు.
"భారత్లో ప్రస్తుతం ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు సాయం చేయాలని భావించాం. ఈ ఆలయం ఎదుట 12 సైకిళ్లను ఏర్పాటు చేశాం. బ్రిటన్ వ్యాప్తంగా ఇతర నగరాల్లోని దేవాలయాలు అన్నింట్లో కలిపి 750 మంది రైడర్‌లు ఇందులో పాల్గొంటున్నారు. ప్రతి వలంటీర్ ఒక గంటపాటు సైకిల్ తొక్కే అవకాశం ఉంటుంది."
-తరుణ్ పటేల్, వలంటీర్
సాధారణంగానే బ్రిటిష్-ఇండియన్ కుటుంబాలు.. భారత్లోని తమ బంధువులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తుంటాయి. అత్యవసర సమయాల్లో విమాన టికెట్ కొనుగోలు చేసి ఇవ్వడమే గాక.. స్వదేశంలో తలెత్తే సంక్షోభాల నివారణకూ విరాళాలు ఇస్తుంటాయి. అయితే వారు కొవిడ్ సమస్యను భిన్నమైనదిగా పరిగణిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరులో భారత్‌కు విదేశాల అండ!
ఇదీ చదవండి: కరోనా కట్టడి కోసం భారత్‌కు 'బోయింగ్' సాయం
దేశ రాజధాని దిల్లీలో ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేక వీధుల్లోనే ప్రాణవాయువు సిలిండర్లతో కార్లలో చికిత్స పొందుతున్న దృశ్యాలు తనను కట్టిపడేశాయని చెబుతున్నారు వలంటీర్లలో ఒకరైన ఐటీ ఉద్యోగి యోగెన్ షా. కొవిడ్ మహమ్మారి సృష్టిస్తోన్న విలయం తనలో అంతులేని విషాదన్ని నింపిందని వివరించారు.
భారత సంతతి ఎల్లప్పుడూ..
తాము చేసే ఈ చిన్న ప్రయత్నం భారత్లోని సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చని, అయితే బ్రిటన్లోని ప్రవాసులు మాతృదేశంలోని వారిని రక్షించుకునేందుకు తమ వంతు కృషి చేశామనే సంతృప్తి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. "మహమ్మారిపై పోరులో భారత్ ఒంటరి కాదు. మేమంతా మా దేశానికి తోడుగా ఉన్నాం. భౌగోళికంగా వేల మైళ్ల దూరంలో ఉండవచ్చు.. కానీ మేము మీతోనే ఉన్నాం." అని తరుణ్ పటేల్ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
ఇక మరోవైపు ప్రిన్స్ ఛార్లెస్ స్థాపించిన 'బ్రిటిష్-ఏషియన్ ట్రస్ట్'.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించేందుకు ముందుకొచ్చింది. వీటితో ఆసుపత్రి ఆక్సిజన్ నిల్వలు తక్కువగా ఉన్న సమయంలో చుట్టుపక్కల గాలి నుంచే ప్రాణవాయువును తయారు చేయవచ్చు.
ఇవీ చదవండి: భారత్‌కు యూనిసెఫ్ 3,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు