'ధిక్కారం' అనే పదానికి నగిషీలు దిద్ది 'సృజనాత్మకత' అనే హంగులు జోడించి నూతన మార్గంలో నడిపిస్తే దాన్నే 'విజయం' అంటారు. అందరూ వెళ్లినబాటలో కాకుండా కొత్తగా ఆలోచించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, స్థాయిని కల్పించుకోవడమన్నమాట. ఈ సృజనాత్మకతకు వ్యాపార దక్షత కూడా తోడైతే చరిత్ర సృష్టించవచ్చు. ప్రపంచ రీతి రివాజుపై ధిక్కార స్వరాన్ని వినిపించి విజయాలబాటలో నడిచిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్..! లైంగిక ఆరోపణలు, జైలు జీవితం.. ఇలాంటివి ఆయన విజయాన్ని ఏమాత్రం ఆపలేకపోయాయి.
స్కూల్ డ్రాపౌట్..!
1950 జులై 19న లండన్‌లో రిచర్డ్ బ్రాన్సన్ జన్మించారు. ఆయన తండ్రి బారిస్టర్. కానీ, కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. బ్రాన్సన్‌కు డైస్‌లెక్సియా అనే శారీరక లోపం ఉంది. ఈ లోపం ఉన్నవారు అక్షరాలను చదవడానికి, నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అందుకేనేమో పుస్తకాలతో వేగలేక 16వ ఏటే చదువుకు స్వస్తి చెప్పాడు. అలాగని అక్షరాలను వదల్లేదు. 1968లో 'స్టూడెంట్'అనే ఓ పత్రిక స్థాపించాడు. అదే బ్రాన్సన్ తొలి బిజినెస్ వెంచర్. ఆ పత్రిక 50,000 కాపీలను ఉచితంగా పంచాడు. తొలి ఎడిషన్‌లో 8,000 డాలర్ల విలువైన ప్రకటనలు విక్రయించాడు. దీంతోపాటు రికార్డులను తపాల ద్వారా పంపించే ఓ వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ రెండూ బ్రాన్సన్‌కు మంచి ఆదాయాన్నే ఇచ్చాయి. తర్వాత వర్జిన్ రికార్డ్స్ లేబుల్స్ కంపెనీని ప్రారంభిచాడు. ఇక్కడ రికార్డ్ అయిన 'టంబ్లుర్ బెల్స్' యూకేలో 247 వారాలు టాప్ లిస్ట్‌లో ఉంది. ఆ తర్వాత ఈ కంపెనీ 'సెక్స్ పిస్టోల్స్', 'ది రోలింగ్ స్టోన్స్' బృందాలతో కలిసి పనిచేసింది. ప్రపంచంలోనే టాప్ 6 కంపెనీల్లో స్థానం దక్కించుకొంది. అప్పటికి బ్రాన్సన్ వయస్సు 23 ఏళ్లే. పన్ను ఎగ్గొట్టడానికి తప్పుడు పత్రాలు వాడారనే ఆరోపణలపై 1971లో స్వల్పకాలం జైల్లో వేశారు.
సంతకం పెట్టాక కన్నీటి పర్యంతం..
1980లో వాయోజర్ అనే ట్రావెల్ కంపెనీని ప్రారంభించాడు. 1984లో వర్జిన్ మెగాస్టోర్స్ ప్రారంభించాడు. కానీ,1992 నాటికి భారీ నష్టాలు రావడంతో వర్జిన్ రికార్డ్స్ లేబుల్స్‌ను ఈఎంఐ అనే కంపెనీకి బిలియన్ డాలర్లకు విక్రయించాడు. ఈ డీల్‌పై సంతకం పెట్టాక కన్నీటి పర్యంతమయ్యాడు. 1993లో వీ2 పేరుతో మరో రికార్డింగ్ కంపెనీని స్థాపించాడు. వర్జిన్ గ్రూపులోని మిగిలిన కంపెనీలు గాడిన పడటం వల్ల 70,000 మందితో 35 దేశాలకు కార్యకలాపాలను విస్తరించాడు. రైళ్ల కంపెనీ, వర్జిన్ మొబైల్స్, గేమింగ్, విలాసవంతమైన ఉత్పత్తులు విక్రయించేవి.. ఇలా పలు కంపెనీలను ప్రారంభించాడు. 2004లో అంతరిక్ష యాత్రల కోసం వర్జిన్ గెలాక్టిక్‌ను స్థాపించాడు. 2017లో వర్జిన్ హైపర్ లూప్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. వర్జిన్ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం 35 దేశాల్లో ఈ గ్రూప్‌కు 40 కంపెనీలు ఉన్నాయి. దాదాపు 400 కంపెనీల నిర్మాణంలో వర్జిన్‌గ్రూప్ పాత్రను గుర్తిస్తూ 2000 సంవత్సరంలో బ్రాన్సన్‌కు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నైట్‌హుడ్ గౌరవాన్ని ఇచ్చారు.
విలాసాలు.. వివాదాలు.. సాహసాలు..
బ్రాన్సన్ ఒకసారి ప్యూర్టోరికోకు విమానంలో వెళ్లాల్సి ఉంది. కానీ, ఆ విమానం ఆలస్యమైంది. దీంతో తాను ఒక అద్దె విమానం తీసుకొని.. అక్కడ మిగిలిన ప్రయాణికులకు అతితక్కువ ఛార్జీతో తనతోపాటు ప్రయాణించే అవకాశం కల్పించాడు. ఈ ఘటన విమానయాన సంస్థను స్థాపించేలా ఆయనను పురిగొల్పింది.
తన బ్రాండ్ పేరును 'వర్జిన్ ఐలాండ్స్' బాగా ప్రమోట్ చేస్తుందని భావించాడు. దీంతో 1979లో ఈ ద్వీప సమూహంలో నెకెర్ అనే ద్వీపాన్ని భారీ మొత్తంతో కొనుగోలు చేశాడు. ఐదేళ్ల తర్వాత అక్కడ ఓ విలాసవంతమైన రిసార్ట్ నిర్మించాడు. ఇప్పుడది సెలబ్రిటీలకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. అక్కడ 30 మంది పెద్దలు, ఆరుగురు పిల్లలు ఉండటానికి ఏర్పాట్లు ఉన్నాయి. విలాసవంతమైన ఈ విడిదిలో ఉండాలంటే ఒక్కరాత్రికి 60,000 డాలర్లు చెల్లించాలి. ఆయన నివాసం కూడా అక్కడే ఉంటుంది. బ్రిటన్‌లో పన్నులు ఎగ్గొట్టడానికి అక్కడ ఉంటున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్రాన్సన్‌కు కెన్యా, దక్షిణాఫ్రికాల్లో ప్రైవేట్ సఫారీ రిజర్వులు కూడా ఉన్నాయి.
బ్రాన్సన్ 1989లో జోన్ టెంపుల్‌మన్‌ను వివాహం చేసుకొన్నాడు. పెళ్లి సమయంలో హెలికాప్టర్‌పై వేదిక వద్దకు వచ్చాడు. అప్పట్లో అదొక సంచలనం.
నెకెర్ బెల్లే పేరుతో ఆయనకు విలాసవంతమైన నౌక కూడా ఉంది. దీనికి వారం రోజుల అద్దె 1,10,000 డాలర్లు. దానిపై బ్రాన్సన్ కరీబియన్ సముద్రంలో గడుపుతాడు.
తన దీవికి వచ్చే పర్యాటకులు అద్భుతమైన అనుభవం పొందేందుకు నెకర్ నయాంఫ్ అనే అండర్ వాటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ఏర్పాటు చేశాడు. ఇది నీటిలో 100 అడుగుల లోతుకు వెళ్లగలదు.
బ్రాన్సన్ తన ఉత్పత్తులకు ప్రచారం కూడా స్వయంగానే చేసుకుంటాడు. 2007లో వర్జిన్ అమెరికా తొలి విమాన ప్రయాణం సందర్భంగా పామ్ కాసినో పై అంతస్తు నుంచి దూకాడు. 2012లో దేశీయ విమాన సర్వీసుల ప్రారంభం సందర్భంగా ఛీర్ లీడర్లతో కలిసి నృత్యం చేశాడు.
ఒకసారి ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండేజ్‌తో ఫార్ములా వన్ రేసుపై పందెం వేశాడు. అందులో బ్రాన్సన్ ఓడిపోయాడు. పందెం నిబంధనల ప్రకారం ఒక మహిళలా వస్త్రాలు ధరించి ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి మలేషియాలోని కౌలాలంపూర్ వరకు ప్రయాణించాడు. తోటి ప్రయాణికులకు అదో భయంకరమైన అనుభవం.
కైట్ సర్ఫింగ్ బ్రాన్సన్‌కు ఇష్టమైన క్రీడ. 61 ఏళ్ల వయస్సులో ఇంగ్లిష్ ఛానల్‌లో కైట్ సర్ఫింగ్ చేశాడు. ప్రపంచంలో ఈ వయస్సులో కైట్ సర్ఫింగ్ చేసిన వ్యక్తిగా రికార్డు దక్కించుకున్నాడు. ఒక మోడల్‌ను నగ్నంగా తన వీపుపై ఎక్కించుకుని కైట్ సర్ఫింగ్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటన ఆయన భార్య దృష్టికి వెళ్లింది. అదో బ్రాన్సన్ స్టైల్ తిక్కచేష్టగా ఆమె కొట్టి పారేసింది.
- 2017లో ఆయన సొంత దీవిలో ఒక సింగర్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ, బ్రాన్సన్ ప్రతినిధి దీనిని కొట్టిపారేశారు.
- 1987లో వర్జిన్ అట్లాంటిక్ ఫ్లయర్ అనే హాట్ ఎయిర్ బెలూన్‌లో అట్లాంటిక్ సముద్రాన్ని దాటాడు. ఇదొక రికార్డు. 1991లో పసిఫిక్ సముద్రంపై ఈ ఫీట్ చేసి మరోసారి రికార్డు సృష్టించాడు.
- 2010లో లండన్ మారథాన్‌ను 5 గంటల 2 నిమిషాల్లో పూర్తి చేశాడు.
- ఆయన ఒక సారి కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తన ల్యాండ్‌రోవర్ వాహనం ఎలా కాపాడిందో ఆయన బహిరంగంగా చెప్పారు. ఇందుకు కృతజ్ఞతగా ల్యాండ్‌రోవర్ ప్రతి ఏటా ఒక కారును ఆయనకు ఇస్తుంది.
- బ్రాన్సన్ విశేషాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఆయన ప్రతి పనిలో తన వ్యాపారానికి ప్రచారం కోరుకుంటారు.
రోదసీ యాత్రలో పాలుపంచుకోవాలని తొలుత బ్రాన్సన్ భావించలేదు. బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ తన రోదసి యాత్రను ప్రకటించాక పోటీగా బ్రాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన కంటే ముందే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేశారు. బెజోస్‌కు దక్కాల్సిన రికార్డును లాగేసుకొన్నారు. బ్రాన్సన్‌పై ఇప్పటికే 10కిపైగా పుస్తకాలు వెలువడ్డాయి. ఇక ఆయనకు లెక్కలేనన్ని అవార్డులు కూడా వచ్చాయి.