ఇటలీపై కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. వైరస్ కేంద్రబిందువు చైనా అనంతరం ఇటలీలోనే మృతుల సంఖ్య అధికంగా ఉండటం.. అక్కడి పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. తాజాగా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 366కు చేరింది. ఒక్క రోజులో 133మంది మృతిచెందడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
మరోవైపు కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 1,492 నుంచి ఒకేసారి 7,375కు చేరుకుంది.
ప్రభుత్వం చర్యలు...
కరోనా కట్టడికి ఇటలీ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. ఆదివారం ఉదయం కోటీ 60 లక్షల జనాభా ఉన్న ఉత్తర ఇటలీ ప్రాంతాన్ని ఏప్రిల్ 3 వరకు నిర్బంధంలో ఉంచుతూ డిక్రీ జారీ చేసింది. వైరస్ నియంత్రణ కోసం దేశంలోని మ్యూజియంలు, థియేటర్లు, పాఠశాలలు, నైట్ క్లబ్లు, కేసినోలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే ఇటలీ చర్యలను ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. ఇటలీ త్యాగానికి సెల్యూట్ చేస్తున్నట్టు పేర్కొంది. ఇటలీకి తమ మద్దతుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ప్రపంచ దేశాలపై కరోనా పంజా.. 3,595 మంది బలి!