ఇటలీ ప్రధానమంత్రి గిసెప్పే కాంటే.. తన పదవికి రాజీనామా చేశారు. నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటరేల్లాకు తన రాజీనామాను సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
బలమైన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే కాంటే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 15 నెలల పాటు కేంద్ర-వామపక్ష కూటమిని నడిపించారు కాంటే. అంతకుముందు మాట్టెయో సాల్విని నేతృత్వంలోని మితవాద పార్టీతో జట్టుకట్టి 15 నెలలు అధికారంలో ఉన్నారు. సాల్విని మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల తొలి ప్రభుత్వం కూలిపోయింది.
గతవారం పార్లమెంట్లో జరిగిన విశ్వాస పరీక్షలో కాంటేకు రెండు ఓట్లు దక్కాయి. తన కూటమి భాగస్వామి, మాజీ ప్రధాని మాట్టెయో ఫిరాయింపుతో సెనేట్‌లో మెజారిటీ కోల్పోయారు. దీంతో కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఇటలీలో.. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం పడింది.
కాంటే రాజీనామా ఆమోదించి, బలమైన కూటమిని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు సెర్గియో సూచించే అవకాశం ఉంది. లేదా పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.