పేదరిక నిర్మూలనకు ఏర్పాటు చేసిన కూటమిలో వ్యవస్థాపక సభ్య దేశంగా భారత్కు చోటు కల్పించింది ఐక్యరాజ్యసమితి. కరోనా మహమ్మారి సంక్షోభంతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాలపైనా ఈ కూటమి దృష్టి సారించనుంది. ఐరాస 74వ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు టిజాన్ మహమ్మద్ బాందే.. దీనిని జూన్ 30న అధికారికంగా ప్రారంభిస్తారు.
ప్రపంచ శాంతి, మానవ హక్కులు, స్థిరాభివృద్ధికి పేదరికం ఎంత ప్రమాదకరమో సభ్య దేశాలకు అవగాహన కల్పించేందుకు ఈ కూటమి వేదికగా ఉపయోగపడుతుందని టిజాన్ అన్నారు. పేదరిక నిర్మూలన చర్యలకు మద్దతు తెలిపే సభ్యదేశాలు, అంతర్జాతీయ సమాజం, ఇతర వాటాదారులను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు.
అది మాత్రమే సరిపోదు..
పేదరికాన్ని అంతం చేయడమంటే ద్రవ్య పరిహారం అందిచడం మాత్రమే కాదని, పేదలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రత, గృహనిర్మాణం, సామాజిక భద్రత కల్పించడమని భారత్ ఈ సందర్భంగా తెలిపింది. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న అనేక మందికి రొట్టె(బ్రెడ్)రూపంలో తప్ప దేవుడు కన్పించడని.. ప్రపంచ సంపదలో 60శాతానికి పైగా డబ్బు.. 2000 బిలియనీర్ల వద్ద మాత్రమే ఉందని ఐరాసలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి రాయబారి నాగరాజ్ నాయుడు అన్నారు. కరోనా మహమ్మారి పేదరికానికి కొత్త కోణాన్ని జోడించిందని, పేదరికమంటే చేయని నేరానికి శిక్ష వంటిదన్నారు.
ఒకే కుటుంబానికి చెెందిన వారు వివిధ రకాలుగా పేదరికాన్ని అనుభవిస్తున్నారని నాగరాజ్ నాయుడు చెప్పారు. మహిళలు, చిన్నారులు పేదరికంతో అసమానంగా ప్రభావితమయ్యారనేందుకు ఆధారాలున్నట్లు వివరించారు. పేదరిక నిర్మూలన విధానాల రూపకల్పనకు ఇవి చాలా ముఖ్యమన్నారు.
201 కోట్ల మందికిపైగా..
కరోనా మహమ్మారికి ముందు ప్రపంచవ్యాప్తంగా 201కోట్ల మంది పేదలున్నారు. వారిలో 7కోట్ల 67లక్షల మంది అత్యంత పేదరికంలో జీవిస్తున్నారు. కొవిడ్ మిగిల్చిన నష్టం కారణంగా మరో 50కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారని ఐరాస నివేదిక స్పష్టం చేస్తోంది.
వేగవంతమైన ఆర్థిక వృద్ధి, విస్తృత సామాజిక భద్రత ద్వారా పేదరికాన్ని అన్ని రకాలుగా అంతం చేయడానికి డిజిటల్ ఫౌండేషన్ ఆధారంగా సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని భారత్ అమలు చేస్తోందని నాగరాజ్ అన్నారు. 2006-2016 మధ్య కాలంలో భారత్లో 2కోట్ల 71లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐరాస అభివృద్ధి కార్యక్రమం తెలిపింది.
ఇదీ చూడండి: అమెరికాలో కరోనా రిటర్న్స్- రికార్డు స్థాయిలో కేసులు