బ్రిటన్ యువరాజు హ్యారీ, ఆయన భార్య మేఘన్ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ చర్చిలో జరిగే వార్షిక కామన్వెల్త్ సర్వీస్‌లో ఈరోజు పాల్గొననున్నారు. రాజ కుటుంబం తరఫున వారు చివరి బాధ్యతలను నెరవేర్చనున్నారు. ఇది ఒక రకంగా వీడ్కోలు లాంటిదని చెప్పవచ్చు.
బ్రిటన్ రాజకుటుంబం నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నట్లు.. హ్యారీ జంట గతంలో తెలిపింది. అనంతరం రెండు నెలల నాటకీయ పరిణామాల అనంతరం వారికి ఆమోదం లభించింది.
అయితే హ్యారీ, మేఘన్‌ల పాత్ర ఇకపై రాజకుటుంబంలో ఉండకపోవడం.. పెద్ద నష్టమేనని ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత జీవీతంపై...
హ్యారీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్లు బ్రిటన్ రాణి ఎలిజబెత్- 2 ఇటీవల అధికారికంగా తెలిపారు. ఈ సందర్భంగా వారిపై మీడియాలో వస్తోన్న వార్తలపైనా స్పందించారు. హ్యారీ, మేఘన్‌లు కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితాలపై అనేక మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై హ్యారీ కేసులు పెట్టిన ఘటనలూ ఉన్నాయి.
రాయల్ ఫ్యామిలీ సేవలు కట్..
మార్చి 31న అధికారికంగా ఈ జంట రాజ కుటుంబం నుంచి వైదొలగనుంది. ఇకపై హ్యారీ దంపతులు రాయల్ ఫ్యామిలీలో సభ్యులుగా కొనసాగరు కనుక వారికి హెచ్ఆర్హెచ్ (హిస్ ఆర్ హెర్ రాయల్ హైనెస్) వర్తించవని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఇటీవల ఓ ప్రత్యేక ప్రకటన వెలువరించింది.
వారు అధికారిక సైనిక నియామకాలతో సహా రాజ విధులను వదులుకొనేందుకు అంగీకరించినట్లు, ఇకపై వారికి ప్రజానిధులు వర్తించబోవని తెలిపింది.
హ్యారీ, మేఘన్ దంపతులకు రాయల్ బిరుదులు ఉంటాయని.. అయితే వాటిని అధికారికంగా వినియోగించుకునేందుకు అవకాశం లేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి.