ప్రపంచంలో అత్యంత సంపన్న ప్రజాస్వామ్య దేశాల కూటమి జీ7 సదస్సు ముగిసింది. ఏడు దేశాల అధినేతలు ప్రపంచ స్థాయి అంశాలపై సవివరంగా చర్చించారు. చైనా మానవ హక్కుల ఉల్లంఘన, కరోనా వైరస్, వ్యాక్సిన్ వంటి విషయాలపై మాట్లాడారు.
చైనా విషయంలో
చైనా పెత్తనానికి ముకుతాడు వేసేందుకు జీ7 కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా నుంచి పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించినట్లు సమాచారం. అంతేకాకుండా లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపడుతున్న ప్రాజెక్టులకు దీటుగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించుతున్నట్లు తెలిసింది.
చైనా విషయంలో తమ దేశాలన్నీ కలిసి ముందుకెళ్తాయని జీ7 విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పారదర్శకతకు విఘాతం కలిగించే విధానాలను వ్యతిరేకిస్తామని తెలిపింది. మరోవైపు, మానవ హక్కులను గౌరవించాలని చైనాకు సూచించనున్నట్లు వెల్లడించింది.
కరోనాపై
- భవిష్యత్తులో కరోనా వంటి ముప్పు రాకుండా చర్యలు
- భవిష్యత్తులో కొత్త రకం వైరస్ ముప్పు ఎప్పుడు బయటపడినా దాన్ని వంద రోజుల్లోనే కట్టడి చేయాలని సంకల్పం
- ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య తీర్మానం(కార్బిస్ బే) ఆమోదం
- ప్రపంచ ఆరోగ్య రంగంలోనే మైలురాయి 'కార్బిస్ బే'
- 100 రోజుల్లో వైరస్ ముప్పును తప్పించేందుకు జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనున్న బ్రిటన్
కరోనా పుట్టుకపై
మహమ్మారి వ్యాప్తికి ల్యాబ్ లీక్ కారణం అయి ఉండొచ్చన్న వాదనను జీ7 కూటమి పరిశీలించింది. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ బయటకు వచ్చిందనే విషయంపై ప్రచురించిన థియరీని అధికారులు పరిశీలించినట్లు బ్రిటన్ విదేశాంగ మంత్రి డామినిక్ రాబ్ తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు అవసరమని జీ7 దేశాధినేతలు అభిప్రాయపడినట్లు చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వైరస్ పుట్టుకను కనుగొనేందుకు చైనా సహకారం అవసరమని స్పష్టం చేశారు.
టీకాలు
కరోనా విజృంభణ, టీకాల కొరత నేపథ్యంలో పేద దేశాలకు ఒక బిలియన్ వ్యాక్సిన్ డోసుల్ని విరాళంగా జీ7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల టీకా డోసుల్ని వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. నేరుగా లేదా కొవాక్స్ కార్యక్రమం ద్వారా వీటిని అందిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.
అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం 11 బిలియన్ డోసులు అవసరమని ఇదివరకు వెల్లడించింది. కరోనాను నిజంగా అంతం చేయాలంటే ప్రపంచంలోని 70 శాతం జనాభాకు టీకాలు వేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: G-7: ప్రపంచానికి బిలియన్ డోసుల భరోసా!
పర్యావరణం
- పర్యావరణ పరిరక్షణ దిశగా కఠినమైన లక్ష్యాలను పెట్టుకోవాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. బొగ్గు, శిలాజ ఇంధన వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని సంకల్పించుకున్నాయి.
- వాతావరణ మార్పులపై పోరాడేందుకు జీ7 దేశాలు అందించే నిధుల వాటాను 100 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయం
- 2010 స్థాయులతో పోలిస్తే కర్బన ఉద్గారాలను 2030 నాటికి సగానికి తగ్గించాలనే లక్ష్యం
- పసిఫిక్ ద్వీపదేశాల్లో నిర్వహించే చేపల వేటను తగ్గించి.. సముద్ర తీరాలను సంరక్షించేందుకు 500 మిలియన్ పౌండ్లతో బ్రిటన్ 'బ్లూ ప్లానెట్ ఫండ్' ఏర్పాటు
- 2030 నాటికి జీవవైవిద్య నష్టాన్ని అడ్డుకునేందుకు నేచర్ కాంపాక్ట్ విధానానికి ప్రోత్సాహం
పన్నులు
పన్ను రేట్లు తక్కువగా ఉండే దేశాలను ఉపయోగించుకొని స్వదేశంలో ట్యాక్స్ ఎగవేతకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎంఎన్సీల నుంచి 'గ్లోబల్ మినిమమ్ ట్యాక్స్' వసూలు చేయాలని జీ7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయంపై జీ7 దేశాల ఆర్థిక మంత్రులు ఈ నెల మొదట్లోనే చర్చలు జరిపారు. కనీసం 15 శాతం పన్నును భారీ మల్టీనేషనల్ కంపెనీల నుంచి వసూలు చేయాలని ప్రతిపాదించారు.
ఇదీ చదవండి: 'చిన్న కూటములతో ప్రపంచాన్ని శాసించలేరు'