చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఫ్రాన్స్‌లో వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 29మంది కరోనాకు బలయ్యారు. ఫ్రాన్స్‌లో వైరస్ వ్యాప్తి చెందినప్పటి ఒక్కరోజులో మరణించిన వారి సంఖ్యలో ఇదే అధికం. తాజా మృతులతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 120కి చేరినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓలీవర్ వెరాన్ తెలిపారు. కొత్తగా 900 వందలమందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరించారు అధికారులు.
ఫ్రాన్స్‌లో వైరస్ సోకిన వారి సంఖ్య 5400కు చేరింది.
ఎన్నికలపై కరోనా ప్రభావం..
ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన మునిసిపల్ ఎన్నికలపై వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా భయంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు మొగ్గుచూపలేదు. అయితే వచ్చే ఆదివారం జరగనున్న రెండో విడత ఎన్నికలపై స్పష్టత కోసం శాస్త్రీయ సలహాదారులతో ప్రభుత్వ అధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ప్రజలను ఇళ్లనుంచి బయటకు రాకుండా ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.