ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు చేపట్టిన బ్రెగ్జిట్ ప్రక్రియకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బ్రిటన్కు యురోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు ఫ్రాన్స్ టిమ్మోర్మాన్ భావోద్వేగ ' ప్రేమ లేఖ' రాశారు.
బ్రిటన్పై తన అభిప్రాయాలను వెల్లడించిన విషయాలను.. స్థానిక ది గార్డియన్ వార్తా పత్రికలో 'ప్రేమ లేఖ' శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఐరోపా సమాఖ్యలో తిరిగి చేరడానికి బ్రిటన్కు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు ఎవరో.. నాకు ఏమిచ్చావో.. నీ బలాలు, బలహీనతలు అన్నీ తెలుసు. నిన్ను ఓ మాజీ ప్రేమికుడిగా ఎప్పటికీ ఇష్టపడుతుంటా. నువ్వు నన్ను విడిచి వెళ్లడానికి నిర్ణయించుకున్నావు. అది నా గుండెను ముక్కలు చేసింది. అయినా నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. నీకు దూరంగా మేము ఎక్కడికి పోము. నీ కోసం మా తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి." - ఫ్రాన్స్ టిమ్మోర్మాన్, ఈయూ కమిషన్ ఉపాధ్యక్షుడు.
జనవరి 31 గడువు
బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు వచ్చే ఏడాది జనవరి 31 వరకు గడువు ఉంది. వీలైనంత తొందరగా పూర్తి చేస్తాననే హామీతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన బోరిస్.. ఆ నిర్ణయాన్ని విరమించుకునే ప్రసక్తి లేదు. దీంతో బ్రెగ్జిట్ ఖాయమైన నేపథ్యంలో చిరకాల మిత్రుడు విడిపోతున్నాడన్న బాధతో ప్రేమ లేఖ కథనాన్ని రాశారు యురోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు ఫ్రాన్స్ టిమ్మోర్మాన్.