నూతన సంవత్సరం వచ్చేసింది. 2020 మిగిల్చిన చేదు అనుభవాలు కాలగర్భంలో కలిసిపోయి.. 2021లో అయినా ప్రపంచం సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని కాంక్షిస్తున్నారు. సాధారణంగా డిసెంబర్ 31న అర్ధరాత్రి 12గంటలు అవగానే కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొంటారు. అయితే, కొన్ని దేశాలు నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రానున్న రోజుల్లో మంచి జరగాలని విచిత్రమైన సంప్రదాయాలను పాటిస్తున్నాయి. అవేంటో చూద్దామా..!
ప్లేట్లు.. గిన్నెలు పగలగొట్టి (డెన్మార్క్)

డెన్మార్క్‌లో ప్రజలు పనికిరాని ప్లేట్లు, గిన్నెలను దాచిపెట్టి డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి కుటుంబసభ్యులు, బంధువుల ఇంటి తలుపులపై వాటిని విసిరి పగలగొడతారట. అలా వాటిని పగలగొడితే ఇంట్లో ఉండే దుష్టశక్తులు బయటకు వెళ్లిపోతాయని నమ్ముతారు. అంతేకాదు, మరో సంప్రదాయం ప్రకారం.. ప్రజలు కుర్చీలు ఎక్కి నిలబడి, అర్ధరాత్రి 12గంటలు కాగానే.. వాటి నుంచి ఎగిరి కిందకు దూకుతారు. అలా చేస్తే నూతన సంవత్సరంలో అదృష్టం వరిస్తుందని భావిస్తారు.
తెలుపు దుస్తులు ధరించి.. అలలపై ఎగిరి(బ్రెజిల్)

నూతన సంవత్సరం వేడుకల్లో బ్రెజిల్ వాసులు డ్రెస్‌కోడ్‌ను పాటిస్తుంటారు. కొత్త ఏడాది సందర్భంగా ప్రజలంతా తెలుపు రంగు దుస్తులనే ధరిస్తారు. తెలుపురంగు ధరించడం వల్ల అదృష్టం కలుగుతుందని, కొత్త ఏడాది ప్రశాంతంగా సాగిపోతుందని నమ్ముతారు. ఈ రంగు దుస్తుల్లోనే కుటుంబసభ్యులు, స్నేహితులు కలిసి బీచ్‌కు వెళ్తారు. అలా అలలపై ఏడు సార్లు ఎగిరి దూకితే అదృష్టం దక్కుతుందని అక్కడి వారి విశ్వాసం. ఏడు సంఖ్యను బ్రెజిల్‌లో అదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు. అందుకే అలలపై ఏడుసార్లు జంప్ చేస్తారు.
ఖాళీ సూట్‌కేసులు మోసుకెళ్లి(కొలంబియా)

కొలంబియా ప్రజలు పర్యటనలతో కూడిన సంతోషకరమైన కొత్త సంవత్సరాన్ని ఎక్కువగా కోరుకుంటారు. అందుకే కొత్త ఏడాదిలో పర్యటనలు ఉండాలని కోరుకుంటూ.. డిసెంబర్ 31 రాత్రి జరుపుకొనే పార్టీలకు రెండు ఖాళీ సూట్‌కేసులను తీసుకెళ్తారు. లేదా.. తాము ఉండే ఇంటి చుట్టూ రెండు ఖాళీ సూట్‌కేసులను పట్టుకొని తిరుగుతారు. అలాగే కొంత డబ్బును కూడా జేబులో పెట్టుకుంటారు. ఇలా చేస్తే కొత్త ఏడాదిలో పర్యటనలు, మంచి ఆదాయం ఉంటుందని కొలంబియా ప్రజలు నమ్ముతారు.
12 ద్రాక్ష పండ్లు తినాలి (స్పెయిన్)

సాధారణంగా నూతన సంవత్సర వేడుకల్ని ద్రాక్ష పండ్ల ద్వారా వచ్చిన మద్యంతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, స్పెయిన్‌లో ద్రాక్ష పండ్లనే తింటూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. స్పెయిన్ ప్రజలు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12గంటలు అవడానికి 12 నిమిషాల ముందు అంటే.. రాత్రి 11.48 గంటల నుంచి ఒక్కో నిమిషానికి ఒక్కో ద్రాక్ష పండు తినడం మొదలుపెడతారు. అలా 12అయ్యే సరికి 12 ద్రాక్షపండ్లు తినేస్తారు. ఒక్కో పండు ఒక్కో నెలలో మంచి జరిగేలా చేస్తుందని భావిస్తారు.
దిష్టిబొమ్మల దహనం(ఈక్వెడార్)

నిరసనల నిమిత్తం రాజకీయనాయకుల దిష్టిబొమ్మలు తగలబెట్టడం చూస్తుంటాం. విజయదశమి రోజున రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేసి దసరా జరుపుకొంటాం. అలాగే, ఈక్వెడార్ ప్రజలు నూతన సంవత్సరం సందర్భంగా దిష్టిబొమ్మలను దహనం చేస్తుంటారు. వారికి నచ్చని రాజకీయ నాయకులు, మనుషులు, జంతువులు, వస్తువులను పోలిన దిష్టిబొమ్మలను తయారు చేయించి డిసెంబర్ 31న అర్ధరాత్రి దహనం చేస్తారు. గత ఏడాది దరిద్రమంతా దిష్టిబొమ్మలతో పోయి.. నూతన ఏడాది సంతోషాలు తీసుకురావాలని కాంక్షిస్తూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. పనామాలోనూ దిష్టి బొమ్మలు దహనం చేసి వేడుకలు జరుపుకొంటారు.
ఉల్లిపాయతో కొట్టి నిద్ర లేపుతారు(గ్రీస్)

గ్రీస్‌లో నూతన ఏడాది సంప్రదాయం గమ్మత్తుగా ఉంటుంది. సాధారణంగా ఉల్లిపాయలను పునఃజన్మకు ప్రతీకగా భావిస్తూ.. ఇంటి ముందు వేలాడదీస్తుంటారు. అయితే, కొత్త ఏడాది తొలి రోజు ఉదయం గ్రీస్‌లో ప్రజలు వారి పిల్లల్ని నిద్ర లేపి ఆ ఉల్లిపాయతో తలమీద కొడతారు. ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో పిల్లలకు అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. మరో సంప్రదాయం ప్రకారం.. కొత్త ఏడాది రోజున కొన్ని బంగారు,వెండి నాణెలను పెట్టి కేకు తయారు చేసి పంచుతారు. ఎవరికైతే కేకు ముక్కలో నాణెలు వస్తే.. వారికి అదృష్టం వరిస్తుందని భావిస్తారు.
108 సార్లు గంట మోగిస్తారు (జపాన్)

నూతన సంవత్సరం సందర్భంగా మనం వీలైతే గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటాం. అలాగే జపాన్‌లో ప్రజలు కూడా బౌద్ధ ఆలయాలకు వెళ్తారు. గుడిలో ఓ సంప్రదాయం ఉంది. నూతన సంవత్సరం రోజున ఆలయంలో ఉన్న గంటను 108సార్లు మోగిస్తారు. ఆ 108 సంఖ్య మనలోని ప్రలోభాలకు ప్రతీక అని అక్కడి బౌద్ధగురువులు చెబుతుంటారు. గంట మోగించినప్పుడు.. ఒక్కో సంఖ్యను పలుకుతుంటే.. ప్రలోభాలు తొలగి మోక్షం లభిస్తుందని.. గతేడాది చేసిన తప్పులు, జరిగిన చెడంతా తొలగిపోతాయని విశ్వసిస్తారు.
నాలుగు విధాలుగా (పోర్టోరికో)

పోర్టోరికోలో నూతన సంవత్సరంలో మంచి జరగాలని నాలుగు రకాల సంప్రదాయాలను పాటిస్తుంటారు. వాటిలో ఒకటి నీళ్లు పారబోయడం. ఏడాదిలో తొలి రోజు ఉదయం బకెట్ నీళ్లను ఇంట్లో ఉన్న కిటికీల గుండా బయటకు పారబోస్తారు. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉండే దుష్టశక్తులు బయటకు వెళ్లిపోతాయని నమ్మకం. అలాగే, పంచదారను ఇంటి బయట వెదజల్లడం వల్ల కూడా చెడు పోయి మంచి జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు, స్పెయిన్‌లో మాదిరిగా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 ద్రాక్ష పండ్లను తింటారు. బీచ్‌లు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అర్ధరాత్రి 12 కాగానే అలలను చెదరగొడతారు.
12 గుండ్రని పండ్లు.. పదార్థాలు (ఫిలిప్పీన్స్)

ఫిలిప్పీన్స్‌లో నూతన సంవత్సరం సందర్భంగా గుండ్రంగా ఉండే 12 రకాల పండ్లు.. ఆహార పదార్థాలను ఇంట్లో డైనింగ్ టేబుల్‌పై పెడతారు. గుండ్రంగా ఉండే ఈ పండ్లు సిరిసంపదలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే 12 నెలలకు ఒక్కో పండు చొప్పున 12 పండ్లు ఒక్క చోటకు చేర్చి.. కొత్త ఏడాదిలో అంత మంచే జరగాలని ప్రార్థిస్తారు. ఆ తర్వాత పండ్లను కుటుంబసభ్యులతో కలిసి తినేస్తారు.
వీలైనంత ఎక్కువ సార్లు తినడమే (ఎస్టోనియా)

ఎస్టోనియా దేశ ప్రజలు కొత్త ఏడాదిని భోజనాలతో వేడుకగా చేసుకుంటారు. ఆ దేశ ప్రజలు ఏడు, తొమ్మిది, పన్నెండును అదృష్ట సంఖ్యలుగా భావిస్తుంటారు. అందుకే కొత్త ఏడాది తొలి రోజున ఏడుసార్లు/తొమ్మిది సార్లు/పన్నెండుసార్లు భోజనం చేస్తారు. ఆ రోజున ఇలా తింటే ఏడాదంతా ఆహారానికి కొదవ లేకుండా ఉంటుందని నమ్ముతారు.
- ఇదీ చూడండి: ప్రియుడి ఘనకార్యం- ప్రియురాలి ఇంటికి సొరంగం