కరోనా మహమ్మారిపై ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే.. ఆ సంస్థలోనూ వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. ఈ అంశంపై అంతర్గతంగా ఉద్యోగులకు అందిన ఈమెయిల్ ద్వారా వైరస్ వ్యాప్తిపై అసోసియేటెడ్ ప్రెస్ కీలక వివరాలు వెల్లడించింది. జెనీవాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తోన్న 65 మంది సిబ్బందికి వైరస్ సోకినట్లు తెలిపింది. అలాగే ఒక క్లస్టర్ వ్యాప్తి ఉన్నట్లు వార్తా సంస్థ వెల్లడించింది. అయితే.. జెనీవా ప్రధాన కార్యాలయంలో ఎలాంటి వైరస్ వ్యాప్తి లేదని డబ్ల్యూహెచ్ఓ బహిరంగంగా తెలపటం గమనార్హం.
ఐరోపాతో పాటు ఆతిథ్య స్విట్జర్లాండ్, జెనీవా నగరంలో కేసుల పెరుగుదల మధ్య ఈ వివరాలు బయటకు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా బారిన పడిన డబ్ల్యూహెచ్ సిబ్బందిలో సగం మంది ఇంటి నుంచి పనిచేసే వారే ఉన్నట్లు ఈమెయిల్ తెలిపింది. కార్యాలయంలో పని చేస్తున్న 32 మంది వైరస్ బారిన పడటం సంస్థ అమలు చేస్తోన్న కఠినమైన పరిశుభ్రత, స్క్రీనింగ్, ఇతర కట్టడి చర్యలు సరిపోవని సూచిస్తోంది.
డబ్ల్యూహెచ్ఓలో వ్యాపార కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న రౌల్ థామస్ శుక్రవారం ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలిందని సిబ్బందికి ఈమెయిల్ పంపారు. అందులో ఒకే బృందానికి చెందిన వారు నలుగురు ఉండగా.. వారితో కలిసిన వ్యక్తి ఒకరు ఉన్నట్లు తెలిపారు. అయితే.. ఈమెయిల్లో క్లస్టర్ వ్యాప్తి అని సూచించలేదు. అవసరమైన ప్రోటోకాల్స్ ప్రకారం ఈ సిబ్బంది వైద్య సాయం పొందుతూ ఇంట్లో ఉంటూ కోలుకుంటున్నారని ఈమెయిల్లో పేర్కొన్నారు.
ఈమెయిల్ ద్వారా బయటపడిన సమాచారం నిజమైనదేనని డబ్ల్యూహెచ్ అధికార ప్రతినిధి ఫరాహ్ దఖ్లాలాహ్ వ్యాఖ్యల ద్వారా తేలింది.
" కరోనా వైరస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రస్తుత ఐదుగురితో జెనీవాలో ప్రధాన కార్యాలయంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65కు చేరింది. "
- ఫరాహ్ దఖ్లాలాహ్, డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి
ఈ మెయిల్ ప్రకారం మొత్తం కేసుల్లో 49 మంది గత ఎనిమిది వారాల్లో వైరస్ బారినపడ్డారని, జెనీవా, పరిసర ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితిని సూచిస్తోందని తెలిపారు డబ్ల్యూహెచ్‌కు చెందిన ఓ అధికారి. టెలీవర్క్ చేసే వారిలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, కానీ ఇంకా అవి బయటపడలేదన్నారు.
చివరగా.. వైరస్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ఈమెయిల్ పేర్కొంది. భౌతిక సమావేశాలు, ముఖ్యంగా సాధారణ ప్రదేశాలు, ఫలహారశాలలో సమావేశాలను నిషేధించాలని పేర్కొంది. కచ్చితంగా అవసరమైన చోట మాత్రమే సమావేశాలు ఉండాలని సూచించింది.
ఇదీ చూడండి: 'వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ నిబంధనలు మానొద్దు'