కరోనా వైరస్‌పై పోరాడేందుకు చైనా, అమెరికా ఏకమవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. కరోనాపై పోరుకు సంబంధించి తమ అనుభవాలను, దగ్గరున్న సమాచారాన్ని అగ్రరాజ్యంతో పంచుకుంటామని స్పష్టంచేశారు.
చైనాకన్నా అధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదైన వేళ... ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు జిన్‌పింగ్. "ప్రస్తుతం అమెరికా-చైనా సంబంధాలు సంక్లిష్ట దశలో ఉన్నాయి. ఈ సమయంలో పరస్పర సహకారం ఇద్దరికీ లాభదాయకం. అదే ఇద్దరికీ ఉన్న ఉత్తమ మార్గం. ద్వైపాక్షిక బంధాన్ని మెరుగుపరుచుకునేందుకు అమెరికా సరైన చర్యలు తీసుకుంటుందని , కరోనాపై పోరాడేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నా" అని అన్నారు చైనా అధ్యక్షుడు.
రాజీ వ్యూహం?
కరోనా వైరస్ వ్యవహారంపై కొద్దిరోజులుగా అమెరికా, చైనా పదేపదే విమర్శలు చేసుకుంటున్నాయి. అమెరికా సైన్యమే వుహాన్‌కు వైరస్‌ను తీసుకొచ్చిందని బీజింగ్ ఆరోపించగా.. వుహాన్ నుంచి వచ్చిన ఈ వైరస్ కారణంగా ప్రపంచమంతా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు ట్రంప్, జిన్‌పింగ్ సానుకూల చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.