మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని, ఆ దేశ సైన్యాన్ని అమెరికా డిమాండ్ చేసింది. సైన్యం నిరంకుశత్వాన్ని ఇలాగే కొనసాగిస్తే తీసుకోవాల్సిన చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. మయన్మార్ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మయన్మార్‌లో తమ హక్కుల పరిరక్షణకు శాంతియుత ఆందోళన చేసే వారికి మద్దతు ఇస్తామని ప్రైస్ వెల్లడించారు.
మయన్మార్‌లో బహిరంగ సభలను పరిమితం చేస్తూ సైన్యం తీసుకున్న నిర్ణయంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుత నిరసనలు, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం జరిగే ఆందోళనలకు అగ్రరాజ్యం అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఆసియా నేతలతో...
మయన్మార్ సైనిక తిరుగుబాటుపై ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఆసియా దేశాల నేతలతో సంప్రదించనున్నట్లు ఐరాస ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మయన్మార్‌లోని పరిస్థితులను గుటెరస్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం పునరుద్ధరణకు మద్దతుగా ప్రపంచ దేశాలు ద్వైపాక్షిక చర్చలు చేపట్టాలని కోరనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:'ఎన్నికలు జరిపి విజేతలకు పట్టం కడతాం'