మయన్మార్లో సైనిక తిరుగుబాటు తర్వాత కనీసం 70 మంది పౌరులను ఆ దేశ భద్రతా బలగాలు మట్టుబెట్టాయని ఐరాస మానవహక్కుల స్వతంత్ర నిపుణుడు థామస్ ఆండ్రూస్ తెలిపారు. విశ్వసనీయ వర్గాల ఆధారాలను ఉటంకించిన ఆయన.. గడిచిన నెలరోజుల వ్యవధిలో మయన్మార్లో హింస గణనీయంగా పెరిగిందని అన్నారు. మయన్మార్ మృతులు, నిర్బంధించిన వ్యక్తులపై నివేదిక విడుదల చేసిన వెంటనే.. ఆ సంఖ్యలు మారిపోతున్నాయని పేర్కొన్నారు. బుధవారం రాత్రి నాటికి నిర్బంధంలో ఉన్నవారి సంఖ్య 2 వేలకు చేరిందని చెప్పారు.
ఐరాస మానవహక్కుల మండలిలో మాట్లాడిన ఆయన.. నిరసనకారులతో పాటు ఇళ్లలో ఉన్న ప్రజలపైనా హింస పెరిగిపోతోందని తెలిపారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలను నిర్బంధిస్తున్నారని చెప్పారు. సైన్యం చేస్తున్న నేరాలపై అధికారిక ధ్రువీకరణ కోసం పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని అభిప్రాయపడ్డారు. హింసకు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి విడుదల చేస్తున్న ప్రకటనలను స్వాగతించిన ఆయన.. పరిస్థితిని మార్చేందుకు అవి సరిపోవని స్పష్టం చేశారు.
'నిగ్రహంగా ఉన్నాం'
కాగా, మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు ఆ దేశ సైన్యం చెబుతోంది. శాంతి భద్రతలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మయన్మార్ విదేశాంగ కార్యదర్శి చాన్ ఆయే పేర్కొన్నారు. నిరసనకారులతో వ్యవహరించే సమయంలో నిగ్రహం పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
మయన్మార్ ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని చెప్పారు. రాజకీయ స్వతంత్రత, ప్రాదేశిక సమగ్రత, జాతీయ ఐక్యత, సామాజిక సుస్థిరతలను కాపాడేందుకు తాము చేస్తున్న కృషిని ఐరాస సహా అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఐరాస విజ్ఞప్తి బేఖాతరు- పది మంది కాల్చివేత