అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు పోరాడి అలసిపోయారని, ఇప్పుడు అమెరికాతో శాంతి ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా దళాలు వెనక్కి వచ్చే సమయం ఆసన్నమైనట్లు తెలిపారు. వచ్చే వారం రోజుల్లో తాలిబన్లతో చర్చలు ఫలిస్తే శాంతి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.
"మేం 19ఏళ్లుగా అక్కడ ఉన్నాం. తాలిబన్లు శాంతి ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు. మేం కూడా ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నాం. ఈ ఒప్పందం విజయవంతం అవుతుందని నేను అనుకుంటున్నాను. తాలిబన్లు పోరాడి అలసిపోయారు. ఈ వారం రోజులు ఏం జరుగుతుందో చూడాలి. వారం లోపు చర్చలు పూర్తయితే ఒప్పందంపై సంతకం చేయడానికి నేను సిద్ధమే."-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అఫ్గాన్ తాలిబన్లతో శాంతి ఒప్పందానికి ముందు అమెరికా ఏడు రోజుల పాక్షిక సంధి కాలం ఏర్పడిన సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సుదీర్ఘ చర్చలు
గతేడాది సెప్టెంబర్‌లో తాలిబన్లతో చర్చలను అర్ధాంతరంగా ముగించిన ట్రంప్.. ఇటీవలే పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందం కుదిరితే అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, 18 ఏళ్ల సుదీర్ఘ మిలటరీ ఒప్పందానికి ముగింపు పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం అఫ్గాన్‌లో దాదాపు 14వేల మంది అమెరికా సైనికులు ఉన్నట్లు సమాచారం.