కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ప్రభావంతో దాదాపు రెండు నెలలు ఇళ్లకే పరిమితమయ్యారు చైనా వాసులు. ప్రస్తుతం ప్రపంచం కరోనాతో అవస్థలు పడుతుంటే చైనాలో మాత్రం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీజింగ్‌లోని పర్యటక ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతిస్తున్నారు అధికారులు. చెర్రీ పూలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ యుయువాంటన్ పార్క్ ప్రస్తుతం రకరకాల పూల అందాలతో శోభిల్లుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పెద్దఎత్తున తరలివస్తున్నారు.
షరతులు...
అయితే పర్యటక ప్రాంతాలకు వెళ్లాలంటే కొన్ని షరతులు పెట్టింది ప్రభుత్వం. యుయువాంటన్ పార్క్‌ను సందర్శించాలంటే ఒక్కరోజు ముందుగానే ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఏప్రిల్ 15 వరకు మాత్రమే టిక్కెట్లను అందుబాటులో ఉంచిన అధికారులు 30 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఆయా ప్రాంతాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లను విధిగా ధరించాలని, ఒకచోట ఎక్కువమంది గుమికూడదని షరతులు పెట్టారు.
ఇదీ చూడండి:కరోనా సెలవుల్లో టైమ్‌పాస్ కోసం ఉచితంగా పుస్తకాలు